
తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ వైఫల్యాలపై ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని.. ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు.
ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతల సమావేశం జరిగింది. సమావేశం తర్వాత మాట్లాడిన లక్ష్మణ్… టీఆర్ఎస్ కు ప్రత్నామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందన్నారు. పార్టీ ఫిరాయింపులు మంచిది కాదన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిందని… ఇప్పుడు TRS చేస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అభద్రతా భావంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను TRSలో చేర్చుకుంటున్నారన్నారు. సారు కారు ఢిల్లీలో సర్కార్ అని కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పాలని అనుకున్నారు….కానీ ఎన్నికల్లో ఆయన కూతురు కూడా ఓడిపోయిందన్నారు.
రాష్ట్రంలో జులై 6న పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడతామన్న లక్ష్మణ్.. బీజేపీలో చేరడానికి చాలామంది ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణపై పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు లక్ష్మణ్.