- త్వరలో తెస్తం: సీఎం రేవంత్
- మైనార్టీల హక్కులకు భంగం కలిగితే అండగా ఉంటం
- సంక్షేమ పథకాల్లో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు
- అధిక ప్రాధాన్యతనిస్తున్నం
- ఏసుక్రీస్తు బోధనల స్ఫూర్తితో పాలన సాగిస్తున్నం
- డిసెంబర్ నెల కాంగ్రెస్‌కు
- మిరాకిల్ మంత్ అని వెల్లడి
- ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం
- తరఫున క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవించే వాతావరణం కల్పించామని, ఎక్కడైనా ఇతర మతాలను కించపరిచే విధంగా మాట్లాడితే శిక్షించేలా త్వరలో కఠిన చట్టం తెస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘‘మా ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.. మైనార్టీల హక్కులకు భంగం కలిగితే మా ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని హామీ ఇచ్చారు.
రెండేండ్లలో తమపై ఎన్ని విమర్శలు వచ్చినా, సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. పేదల ఆత్మగౌరవం పెంచేలా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. శనివారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని, మాట్లాడారు.
తమ ప్రభుత్వం ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో పని చేస్తున్నదని తెలిపారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంలాంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారని, తమ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్కరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నదని వివరించారు. రైతుల కోసం రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, వ్యవసాయాన్ని పండుగలా మార్చామని చెప్పారు.
ఏసు ప్రభువు శాంతిని పంచారు..
రెండు వేల ఏండ్ల క్రితం పశువుల పాకలో జన్మించిన ఏసుక్రీస్తు.. మానవ సేవే.. మాధవ సేవ అని చాటారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రేమను, శాంతిని పంచడానికే ఆయన జన్మించారని పేర్కొన్నారు. డిసెంబర్ నెల ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిందన్నారు. ఏసు ప్రభువు జన్మించిన ఈ నెలలోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కూడా పుట్టారని తెలిపారు.
ఆమె రాజకీయ మూల్యం చెల్లించి, పదవులను త్యాగం చేసి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలను చూడలేక, తల్లుల కడుపు కోతను ఆపేందుకు సోనియాగాంధీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
విద్య, వైద్య రంగాల్లో మిషనరీల కృషి
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్రధాని నెహ్రూ విద్య, ఇరిగేషన్, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అయితే, ఆనాడు ప్రభుత్వంతో పోటీపడి క్రిస్టియన్ మిషనరీస్ ఒక యుద్ధంలా పనిచేసి విద్య, వైద్యాన్ని మారుమూల ప్రాంతాలకు చేర్చాయని ప్రశంసించారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో సగటు మనిషి జీవన ప్రమాణం కేవలం 32 ఏండ్లే ఉండేదని, మిషనరీలు విద్య, వైద్య రంగాల్లో చేసిన కృషి వల్ల నేడు అది 72 ఏండ్లకు పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు.
