- రేపు బూర్గంపహాడ్‌లో మాక్ డ్రిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లాలో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్(ఈఓసీ)ను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు అప్రమత్తత చాలా ముఖ్యమని తెలిపారు. ఈవోసీలో పలు శాఖలకు చెందిన జిల్లా స్థాయి ఆఫీసర్లు, ఫైర్, పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సభ్యులుగా ఉంటారని చెప్పారు.
సభ్యులు విపత్కర పరిస్థితుల్లో చేపట్టాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అవసరమైన సామగ్రి, వనరులతో కూడిన ప్రణాళికను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విపత్కర పరిస్థితిలో సమాచార మార్పిడి కీలక పాత్ర పోషిస్తుందని, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నీటిమట్టం, వర్షపాతం, వంతెనలు, నీటి విడుదల వంటి అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేలా ప్లాన్ చేసుకోవాలన్నారు.
గోదావరి నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహించిన సమయంలో తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఈ నెల 22న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. మాక్ డ్రిల్ ద్వారా లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకోవాలన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, డిప్యూటీ కలెక్టర్ మురళి, జడ్పీ సీఈవో నాగలక్ష్మి పాల్గొన్నారు.
