దివ్యాంగులను ఆదుకోవడం అభినందనీయం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

దివ్యాంగులను ఆదుకోవడం అభినందనీయం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేందుకు కృత్రిమ అవయవాలు, ట్రైసైకిళ్లు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నగరంలోని మెట్టుగడ్డ లిటిల్  స్కాలర్స్  స్కూల్​ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రైసైకిళ్లు అందజేశారు. విదేశాల్లో ఉంటున్నప్పటికీ స్వదేశంపై మమకారం, సేవాభావంతో అమెరికా తెలుగు సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. 

ఇలాంటి కార్యక్రమాలతో దివ్యాంగుల్లో మనోధైర్యాన్ని పెంచుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, వినోద్ కుమార్, అమెరికా తెలుగు సంఘం  అధ్యక్షుడు నవీన్ రెడ్డి, విజయ్ పాల్ రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్ లో సదాలక్ష్మి విగ్రహం  ఏర్పాటు చేస్తాం

మహబూబ్ నగర్ టౌన్: తెలంగాణ తొలి తరం ఉద్యమకారిణి, దివంగత టీఎస్  సదాలక్ష్మి విగ్రహాన్ని హైదరాబాద్​లో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల దళిత ఫోరం నాయకులు, ఉద్యమకారులు శనివారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలి తరం ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలు రాష్ట్ర సాధనకు పునాదులుగా నిలిచాయని తెలిపారు. 

1957లో కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీఎస్  సదాలక్ష్మి ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, మహిళల హక్కుల కోసం కృషి చేశారని గుర్తు చేశారు. సదాలక్ష్మి విగ్రహాన్ని హైదరాబాద్​లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. టీఎమ్మార్పీఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు సిరిసనోల బాలరాజు, బోయపల్లి నర్సింహులు, రామన్న, యాంకి రమేశ్, టంకర బుచ్చన్న, వెంకటేశ్​ పాల్గొన్నారు.