- అభినందించిన కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
- సర్టిఫికెట్లు అందజేత
ఆసిఫాబాద్, వెలుగు: కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ్ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్-2025–26 కార్యక్రమంలో జిల్లాలోని స్కూళ్లు గుర్తింపు సాధించడం అభినందనీయమని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గుర్తింపు పొందిన స్కూళ్ల ప్రతినిధులకు శనివారం కలెక్టర్ ఛాంబర్లో అడిషనల్ కలెక్టర్, ఇన్ చార్జ్ డీఈవో దీపక్ తివారీతో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన రేటింగ్లో జిల్లాలోని సావర్ ఖేడ్, దహెగాం మండలం రాంపూర్, నాగేపల్లిలోని ఎంపీపీఎస్స్కూళ్లు, చిన్న రాస్పల్లిలోని జడ్పీహెచ్ఎస్, రెబ్బన, కౌటాలలోని కేజీబీవీలు, కాగజ్ నగర్లోని అరుణోదయ హైస్కూల్ ప్రత్యేక గుర్తింపు సాధించాయని తెలిపారు.
నీటి వినియోగం, మరుగుదొడ్ల నిర్వహణ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, ప్రవర్తన, మిషన్ లైఫ్ కార్యక్రమాల అమల్లో ఈ స్కూళ్లు ఆదర్శంగా నిలిచి గుర్తింపు సాధించినట్లు పేర్కొన్నారు. విద్యా సంస్థలు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా.. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, జీవన విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
స్కూళ్లకు సైన్స్ కిట్ల పంపిణీ
డ్రీమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలో ఎంపిక చేసిన స్కూళ్లకు సైన్స్ కిట్లను కలెక్టర్ అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు సైన్స్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
భవిత కేంద్రం ప్రారంభం
ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం భవిత కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నాణ్యమైన విద్య, తెరపీ, మార్గదర్శక సేవలు అందించేందుకు భవిత కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి, వారికి తగిన సహాయం అందించడమే భవిత కేంద్రాల లక్ష్యమన్నారు.
