పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్యవధిని తగ్గించండి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్యవధిని తగ్గించండి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
  •      సీఎం రేవంత్ రెడ్డికి టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో రోజుల వ్యవధిని తగ్గించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డికి పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి తో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం ఒక్కో సబ్జెక్టు పరీక్షకు మధ్య దాదాపు 5 రోజుల వ్యవధి ఉంటోందని, దీనివల్ల టెన్త్ పరీక్షలు పూర్తి కావడానికి నెల రోజుల సమయం పడుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షల కోసం నెల రోజుల పాటు సమయం కేటాయించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని శ్రీపాల్ రెడ్డి వివరించారు. 

విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ వ్యవధిని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ వినతిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సీఎం తన కార్యదర్శి అజిత్ రెడ్డిని ఆదేశించారు. సీఎంని కలిసిన వారిలో పీఆర్టీయూ ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.