- మహిళా సర్పంచ్‌లు కూడా చిన్న వయస్సు వారే
- మధ్య వయస్సు ఉన్నవారు 297 మంది
- పల్లె పాలనలో విద్యావంతులు ఎక్కువే
- 2వ తరగతి నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ వరకు 66.35 శాతం మంది ఎన్నిక
కామారెడ్డి, వెలుగు : పల్లె పాలనలో నవతరం వచ్చింది. ఇంత వరకు గ్రామ పాలకులుగా మధ్య వయస్సు, వృద్ధులు కనిపించేవారు. గతంలో యువత సంఖ్య తక్కువ. మారిన రాజకీయ పరిస్థితులతో యువత, విద్యావంతుల వైపు పల్లె ఓటర్లు మొగ్గు చూపారు. కామారెడ్డి జిల్లాలోని పంచాయతీల్లో సర్పంచ్‌లుగా యువకులకు పట్టం కట్టారు.
విద్యావంతులు కూడా అధికంగా ఉన్నారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ చదివిన యువకులు విజేతలయ్యారు. అధిక శాతం మంది ఫస్ట్ టైం పోటీ చేసినవారే. యువత, విద్యావంతులు పల్లెల అభివృద్ధి కోసం ముందుకు రావడంతో పల్లె జనం సంతోషం వ్యక్తం చేస్తోంది. పల్లెలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
175 మంది సర్పంచ్‌లు యువకులే.
జిల్లాలో 532 పంచాయతీలు, 4,656 వార్డులు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల ఫలితాల్లో సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా విద్యావంతులు, యువత, మధ్య వయస్సు వారు విజేతలయ్యారు. 55 ఏండ్లు పైబడిన వృద్ధుల సంఖ్య స్వల్పంగానే ఉంది. గతంలో కంటే ఈసారి నిరక్షరాస్యుల సంఖ్య కూడా తగ్గింది. పల్లెపాలనలో యువత ( 19 నుంచి 35 ఏండ్ల మధ్య ఉన్న వారు) 175 మంది ( 32. 89 శాతం) , మధ్య వయస్సు ఉన్నవారు (36 నుంచి 55 ఏండ్లు) 297 మంది ( 55.82 శాతం), 55 ఏండ్ల పైబడిన వృద్ధులు 37 మంది ( 11 శాతం) ఉన్నారు.
వృద్ధుల్లో 70 ఏండ్లు పైబడిన వారు నలుగురు ఉండటం విశేషం. వార్డు మెంబర్లు కూడా చాలా ఏరియాల్లో యువత విజయం సాధించగా, ఇందులో కూడా చదువుకున్న వారే అధికం. విజేతల్లో అతి చిన్న వయస్సు ఉన్నవారు ( 21 నుంచి 25 ఏండ్లు) మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది.
డిగ్రీలు, పీజీలు చదిన వారు..
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో డిగ్రీలు, పీజీలు, ఎంబీఏ వంటి కోర్సులు చదివిన వారు బరిలో నిలిచారు. చాలా చోట్ల విద్యావంతులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. 2 తరగతి నుంచి అండర్
గ్రాడ్యుయేషన్ వాళ్లు 353 ( 66.35 శాతం) ఉండగా, వీరిలో ఎక్కువ మంది 10 నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్లు ఉన్నారు. డిగ్రీ 82 మంది ( 15.41 శాతం), పీజీ 15 మంది ( 2.81 శాతం), నిరక్షరాస్యులు 82 ( 15.41 శాతం) ఉన్నారు.
అభివృద్ధి కోసం ముందుకొచ్చా..
డిగ్రీ చదివాను. గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌కి పోటీ చేసి గెలిచా. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన పాలన అందిస్తా. పంచాయతీకి వచ్చే ఫండ్స్‌ను సద్వినియోగం చేస్తూ మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయార్టీ ఇస్తా. పల్లె పాలనలో మార్పు తీసుకొస్తా. - లావణ్య, లింగంపల్లి, సర్పంచ్
యువత కోసం డిజిటల్ లైబ్రరీ
పీజీ, బీఈడీ చదివా. ప్రజలు నన్ను నమ్మి పట్టం కట్టారు. వివిధ పోటీ పరీక్షలకు యువత సిద్ధమయ్యేందుకు అవసరమైన వనరులు సమకూరుస్తా. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తా. స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా. మహిళల అభ్యున్నతి కోసం పని చేస్తా. - రాధ, ముస్తాపూర్
చిన్న వయస్సులో సర్సంచ్గా ఎన్నిక
డిగ్రీ చదివాను. 21 ఏండ్లకే సర్పంచ్‌గా గెలిచా. గ్రామస్తులు, అధికారుల సహకారంతో మెరుగైన పాలన అందించటమే లక్ష్యం. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా కార్యక్రమాలు చేపడుతా. సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. -యోగితా, మల్కాపూర్
మౌలిక వసతుల కల్పనకు ప్రయార్టీ
22 ఏండ్లకే సర్సంచ్గా ఎన్నిక కావటం సంతోషంగా ఉంది. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తా. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తా. విద్యావంతులు సర్పంచ్‌గా ఉంటే ఏ విధంగా మార్పు ఉంటుందో చూపిస్తా. - నవ్య, కల్యాణి
