వెలుగులు నింపుతున్న ‘టాస్క్’

 వెలుగులు నింపుతున్న ‘టాస్క్’
  • శిక్షణ కేంద్రంతో నిరుద్యోగుల్లో నైపుణ్యాల పెంపు
  • 180 మందికి స్కిల్​ ట్రెయినింగ్​ పూర్తి
  • 77 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన
  • ములుగు  శ్రీయ ఇన్​ఫోటెక్ లో ఇం​టర్న్​షిప్​ చేస్తున్న ఎనిమిది మంది

ములుగు, వెలుగు : ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగానే ములుగు జిల్లా కేంద్రంలో టాస్క్​(తెలంగాణ అకాడమీ ఫర్​ స్కిల్ అండ్​ నాలెడ్జి) శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు స్కిల్​ డెవెలప్​మెంట్​తో పాటు జాబ్​ మేళాలు నిర్వహించి ఉపాధి కల్పిస్తోంది. 

అంతేకాకుండా మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఇక్కడే ఐటీ సెంటర్​ ఏర్పాటు కావడంతో ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఐటీ కంపెనీ ఎంతో ఉపయోగపడుతోందని, నిరుద్యోగుల ఇండ్లల్లో టాస్క్​ వెలుగులు నింపుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

టాస్క్​ ద్వారా 180 మందికి శిక్షణ..

టాస్క్​ సెంటర్లలో నైపుణ్య శిక్షణ ఇస్తూ మూడు విభాగాల్లో ఎంచుకున్న కోర్సులను బట్టి ట్రెయినింగ్​ ఇన్నారు. ఈ ఏడాది జనవరి 25న ములుగులోని బండారుపల్లి రోడ్డులోని పాత బీసీ హాస్టల్​ భవనంలో టాస్క్​ సెంటర్​ను ప్రారంభించారు. అప్పటి నుంచి 6 బ్యాచ్​లకు, ఒక్కో బ్యాచ్ లో 30మంది చొప్పున మొత్తం 180 మందికి శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా టెక్నికల్, నాన్​ టెక్నికల్, పోటీ పరీక్షల నిమిత్తం ట్రెయినింగ్​ ఇస్తున్నారు. 

టెక్నికల్​ విభాగంలో సీ, సీ ప్లస్ ప్లస్, జావా, డీసీఎంఎస్, పైథాన్, ఒరాకిల్, టాలీ, ఆటోక్యాడ్, నాన్​టెక్నికల్​ విభాగంలో కమ్యూనికేషన్, సాఫ్ట్​ స్కిల్స్, పర్సనాలిటీ డెవెలప్​మెంట్, రెస్యూం బిల్డింగ్, కాంపిటేటివ్​ విభాగంలో జనరల్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, జీకే, కరెంట్ అఫైర్స్​ తదితర స్కిల్స్​నేర్పిస్తున్నారు. టాస్క్​ సెంటర్ లో జిల్లాకు చెందిన 180 మందికి స్కిల్​ డెవెలప్​మెంట్ ట్రెయినింగ్​ ఇవ్వగా 77 మంది ఉపాధి పొందినట్లు నిర్వాహకులు తెలిపారు.

మొదటి నాలుగు బ్యాచ్​లకు సంబంధించి జూన్​19న జాబ్​ మేళా నిర్వహించగా, అందులో వివిధ కంపెనీల ఆఫర్లతో 57 మంది ప్రైవేటు కంపెనీల్లో వారి నైపుణ్యాలను బట్టి జాబ్ లు పొందారు. 5వ బ్యాచ్​కి సంబంధించి ములుగులో ఏర్పాటు చేసిన శ్రీయ ఇన్ఫోటెక్​ కంపెనీలో ఎనిమిది మంది ఉపాధి పొందారు. అందులో కొందరికి రూ.1.80లక్షల ప్యాకేజీతో విధులు నిర్వర్తిస్తున్నారు. 6వ బ్యాచ్​ ఇటీవలే పూర్తి కాగా, వారికి కలెక్టర్​ దివాకర ఆధ్వర్యంలో డిసెంబర్​ 1న సైతం టెలీ పర్ఫార్మెన్స్​ కంపెనీలో అనలిస్ట్, కంటెంట్​మాడరేటర్​ జాబ్స్​కోసం మేళా నిర్వహించారు. 12 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఈ ఐటీ కంపెనీని త్వరలో ప్రారంభం కానున్నది. 

ములుగులో ఐటీ కంపెనీ.. 

ములుగులో శ్రీయ ఐటీ స్టార్టప్​ కంపెనీ ఏర్పాటైంది. అందులో ఇప్పటికే పలువురు ఇంటర్న్​ షిప్​ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్​ సెంటర్​లో శిక్షణ పూర్తి చేసుకున్న ఎనిమిది మంది విద్యార్థులు ప్రస్తుతం ఈ శ్రీయ ఇన్​ఫోటెక్​లో విధులు నిర్వర్తిస్తున్నారు. 

కంపెనీకి వచ్చే ప్రాజెక్టులను బట్టి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. టాస్క్​ సెంటర్​ వెనకాలే కొత్త ఐటీ కంపెనీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై తదితర ప్రాంతాల్లో ఉండే ఐటీ కంపెనీలు ములుగులో కూడా ఏర్పాటు చేస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం అవుతోంది. 

ఇన్ఫోసిస్ లో జాబ్..

ములుగు టాస్క్​ సెంటర్ లో టెక్నికల్, నాన్​ టెక్నికల్, పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకున్నాను. ట్రెయినింగ్​ అనంతరం జాబ్​ మేళాలో ఇన్​ఫోసిస్​ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం టాస్క్​ ద్వారా ఎలాంటి శిక్షణ పొందాలి, ఏ ఉద్యోగానికి ఏవిధంగా ఇంటర్వ్యూకు అటెండ్​ కావాలో తెలపడం ద్వారా పలువురు ఉద్యోగాలు పొందుతున్నారు. - కందాల భావన, ఇన్ఫోసిస్​ ఉద్యోగిని

నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం 

జనవరి 25న ములుగు టాస్క్​ కేంద్రం ఏర్పాటు చేశాం. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహంతో ఈ కేంద్రం నిర్వహిస్తున్నాం. 180 మందికి శిక్షణ పూర్తయింది. అందులో 77 మంది వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. డిసెంబర్​ మొదటి వారంలో నిర్వహించిన జాబ్​ మేళాలో 12మంది ఎంపికయ్యారు. కొర్ర మురళీ కృష్ణ, టాస్క్​ మేనేజర్​, ములుగు