హైదరాబాద్ మరో నేపాలీ ముఠా కలకలం.. రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను బంధించి దోపిడీ..

హైదరాబాద్ మరో నేపాలీ ముఠా కలకలం.. రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను బంధించి దోపిడీ..

హైదరాబాద్ లో మరో నేపాలీ ముఠా కలకలం రేపింది. ఇటీవల జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తులో ఉండగానే మరో నేపాలీ ముఠా అరాచకం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో కౌకురు గోల్ఫ్ ఎంక్లేవ్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను బంధించి దోపిడీ కి పాల్పడింది నేపాలీ ముఠా. బుధవారం ( మే 13 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మీ ఇంట్లో కొంతకాలం క్రితం పని మనుషులుగా చేరింది ఓ నేపాలి జంట.

ఇటీవలే మరో మహిళ వారి బంధువుగా పరిచయమై ఇంట్లోకి వచ్చింది. సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకలను ఇంట్లో చేసుకుంటామని అడగడటంతో అంగీకరించారు ప్రొఫెసర్. రాత్రి బర్త్‌డే వేడుకల పేరుతో ఇంట్లోకి మరో ముగ్గురు వచ్చారు... అనంతరం బర్తడే కోసం కేక్ కొనిపించారు ప్రొఫెసర్ దంపతులు .

వేడుకల పేరుతో ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేసి అమలు చేసింది ముఠా. ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి దాడి చేసి... దంపతులను బెదిరించి చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. ఈ క్రమంలో మీకు కావాల్సింది తీసుకెళ్లండి, మమ్మల్ని చంపకండి అంటూ వేడుకున్నారు బాధితులు.

దీంతో ఇంట్లో నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు ముఠా. దోపిడీ అనంతరం దంపతులకు మత్తుమందు ఇచ్చి గదిలో బంధించారు దుండగులు. 60 తులాల బంగారం, వెండి, 30 వేల నగదు దోచుకొని.. అన్ని గేట్లకు తాళాలు వేసి పరారయ్యారు. మత్తు ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం వరకు తేరుకోని దంపతులు... మత్తు నుండి తేరుకుని కిటికీ నుంచి అరవడంతో తలుపులు తెరిచారు స్థానికులు.

ఇంటి తలుపులు తెరిచి దంపతులను రక్షించారు కాలనీ వాసులు.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌, పనిమనుషుల వివరాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీలో ఏడుగురు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.