- ‘ఫిజిక్స్ వాలా’ సీఈవో దాఖలు
న్యూఢిల్లీ : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 1,500 మందికి పైగా స్టూడెంట్లకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గ్రేస్ మార్కులు కలపడాన్ని సవాల్ చేస్తూ ఎడ్యుటెక్ కంపెనీ ‘ఫిజిక్స్ వాలా’ సీఈవో అలఖ్ పాండే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్‌ను అలఖ్ పాండే తరఫు లాయర్ జె.సాయి దీపక్ మంగళవారం కోరారు.
అయితే ఈ విషయంలో కోర్టు రిజిస్ట్రీని సంప్రదించాలని బెంచ్ సూచించింది. ‘‘నీట్ పై ఇప్పటికే చాలా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. కానీ మా పిటిషన్ వాటన్నింటికీ భిన్నమైనది. ఎన్టీఏ దాదాపు 1,500 మందికి పైగా స్టూడెంట్లకు 70 నుంచి 80 గ్రేస్ మార్కులు కలిపింది. దీనికి వ్యతిరేకంగా 20 వేల మంది స్టూడెంట్ల నుంచి అలఖ్ పాండే సంతకాలు సేకరించారు. మిగతా పిటిషన్లతో కలిపే మా పిటిషన్ ను కూడా విచారిస్తామని కోర్టు సంకేతాలు ఇచ్చింది” అని లాయర్ సాయి దీపక్ తెలిపారు.