రూ.200 కోట్లు పెంచితేనే..రైతులకు బీమా

రూ.200 కోట్లు పెంచితేనే..రైతులకు బీమా
  • ప్రీమియంపై సర్కార్​కు ఎల్​ఐసీ ప్రతిపాదన
  • 11 నెలల్లో మరణించిన రైతులు.. 14,705
  • క్లెయిమ్​ల భారం ఎక్కువైందన్న బీమా సంస్థ
  • ప్రభుత్వం కట్టిన ప్రీమియం రూ. 681 కోట్లు.. రూ. 800 కోట్లకు చేరనున్న క్లెయిమ్​లు
  • ఆగస్టు 13 వరకే బీమా గడువు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వంపై రైతు బీమా పథకం భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి ప్రీమియం మరో రూ. 200 కోట్లకు పెంచాలని ఎల్​ఐ​సీ ప్రతిపాదించింది. ప్రాథమిక అంచనాలతో పోలిస్తే ఎక్కువ మంది రైతులు చనిపోయారని, ప్రీమియం కన్నా క్లెయిమ్​లే ఎక్కువగా ఉన్నాయని.. దీంతో తమకు నష్టం వాటిల్లుతోందని ఆ సంస్థ అంచనా వేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ఈ మేరకు 2019–‌‌‌‌20 సంవత్సరపు ఎంవోయూ ప్రతిపాదనలను వ్యవసాయ శాఖకు అందజేసింది. గత ఏడాది రైతు బీమా పథకం అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్​ఐసీకి రూ. 681 కోట్ల ప్రీమియం చెల్లించింది. ఈ బీమా గడువు వచ్చే నెలతో ముగియనుంది. ఎల్​ఐసీ  తాజా ప్రతిపాదనతో ప్రభుత్వం ఈ సారి చెల్లించాల్సిన ప్రీమియం రూ. 881 కోట్లకు చేరే అవకాశం ఉంది. రెండు నెలలుగా రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి సరిపడే నిధుల్లేక వ్యవసాయ శాఖ సతమతమవుతోంది. ఈ టైమ్​లో ప్రీమియం పెంపు  సమస్యగానే మారుతుందని   అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రీమియం తగ్గించాలని ఆర్థికశాఖ, వ్యవసాయశాఖ అధికారులు ఎల్​ఐసీ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు.  రైతుల అంశం కావటంతో వ్యాపార ధోరణితో కాకుండా ఉదారంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

11 నెలల్లో 14,705 మంది రైతుల మృతి

నిరుడు ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు అంటే 11 నెలల్లో రాష్ట్రంలో మొత్తం 14,705 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు. వీరందరూ 18 ఏండ్ల నుంచి 59 ఏండ్లలోపు వారే.  కరువు కాటకాలతో పంటలు పండక, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా.. ఇంకొందరు పంట పొలాల్లో కరెంటు షాక్​లు, వివిధ ప్రమాదాలతో చనిపోయారు. మరికొందరు అనారోగ్యంతో చనిపోయారు. ఎంవోయూ ప్రకారం.. రైతు ఏ కారణంతో చనిపోయినా రూ. 5 లక్షలు పరిహారంగా చెల్లించాల్సి ఉంది. ఈ నిబంధన సైతం తమకు భారంగా మారిందని ఎల్​ఐసీ వర్గాలు చెప్తున్నాయి. నిరుడు వ్యవసాయ శాఖతో ఎంవోయూ కుదుర్చుకున్న సమయంలో రైతుల మరణాల సంఖ్య ఇంత మొత్తంలో ఉంటుందని  ఊహించలేదని, అందుకే ప్రతి ఏడాది రివ్యూ చేయాలనే షరతును ఎంవోయూలో పొందుపరిచినట్లు వెల్లడించాయి.

ప్రీమియం కన్నా క్లెయిమ్​లే ఎక్కువ

ప్రీమియంతో పోలిస్తే క్లెయిమ్​లు ఎక్కువగా ఉండటం ఎల్​ఐసీకి షాక్​ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన ప్రీమియంతో పోలిస్తే ఎల్​ఐసీ చెల్లించిన పరిహారం దాదాపు రూ. 54 కోట్లు ఎక్కువగా ఉంది. అందుకే సంస్థకు నష్టం వాటిల్లిందని ఎల్​ఐసీ అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుడు రూ. 681 కోట్ల ప్రీమియం చెల్లించింది. చనిపోయిన రైతులకు సంబంధించి బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎల్​ఐసీ చెల్లించిన పరిహారం రూ. 735 కోట్లకు చేరింది. మరో నెల రోజుల్లో క్లెయిమ్​ల మొత్తం రూ. 800 కోట్లు దాటొచ్చని ఎల్​ఐసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా దాదాపు రూ. 200 కోట్ల నష్టం వస్తుందని, ఆ మేరకు ప్రీమియం పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు ఇచ్చినట్లు చెప్తున్నారు. వచ్చే నెల 13తో బీమా గడువు ముగియనుంది. రెండో ఏడాది పథకం వర్తించాలంటే అప్పటిలోగా ప్రభుత్వం ప్రీమియం
చెల్లించాల్సి ఉంది.