ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సప్లిమెంటరీ చార్జ్​షీట్

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సప్లిమెంటరీ చార్జ్​షీట్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో సప్లిమెంటరీ  చార్జ్​షీట్​ దాఖలు చేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో తాజాగా సేకరించిన డిటైల్స్ తో ఢిల్లీ రౌస్ రెవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో గురువారం ఈడీ అధికారులు ఈ చార్జ్ షీట్ ను సమర్పించారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దాఖలు చేసిన చార్జ్​షీట్ల సంఖ్య నాలుగుకు చేరింది. గతేడాది నవంబర్ 25 న సమీర్ మహేంద్రుపై సీబీఐ తొలి చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాతి రోజు నవంబర్ 26 న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తొలి చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ రెండు చార్జ్ షీట్లలో ఢిల్లీ లిక్కర్ స్కాం వివరాలు, ఫోన్ల ధ్వంసం, జోన్లవారిగా కేటాయింపులు, లావాదేవీల అంశాన్ని ప్రస్తావించింది. తర్వాత దర్యాప్తు లో సేకరించిన అదనపు సమాచారంతో జనవరి 6న  ఈడీ సప్లిమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేసింది.

దాదాపు 13, 657 పేజీల సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను ఫిబ్రవరి 2న రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ చార్జ్ షీట్ లో రాబిన్ డిస్టిల్లరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయిన పల్లి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జ్​ విజయ్ నాయర్, బిజినెస్​మెన్​ బినోయ్ బాబుల, అమిత్ అరోరా ల పేర్లను చేర్చింది. అయితే ఈ చార్జ్​షీట్​లో బీఆర్​ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ ఎక్కడా ప్రస్తావించలేదు.కాగా, గురువారం దాఖలు చేసిన రెండో సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో ఒయాసిస్ గ్రూప్ డైరెక్టర్ గౌతమ్ మల్హోత్రా, ఛారియట్ అడ్వర్టయిజింగ్ డైరెక్టర్ రాజేష్ జోషి, ఎన్రికా ఎంటర్​ప్రైజెస్​ యజమాని మాగుంట రాఘవ్ పాత్రలను ఈడీ పేర్కొన్నట్లు సమాచారం.

గౌతమ్ మల్హోత్రాను ఫిబ్రవరి 7న, రాజేశ్ జోషిని ఫిబ్రవరి 8న, మాగుంట రాఘవను ఫిబ్రవరి 10న అరెస్టు చేసినట్లు చార్జ్ షీట్ లో ప్రస్తావించింది. ఈ చార్జ్ షీట్ పై ఏప్రిల్ 14న సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ జరిపి దానిని పరిగణనలోకి తీసుకోవాలా? లేదా ? అనే విషయంపై క్లారిటీ ఇవ్వనుంది.