మణిపూర్​లో మరో ఘోరం.. వివాహితపై గ్యాంగ్​రేప్​

మణిపూర్​లో మరో ఘోరం.. వివాహితపై గ్యాంగ్​రేప్​
  • పోలీసులను ఆశ్రయించిన మరో బాధితురాలు
  • మే 3న సాయంత్రం ఇళ్లు తగలబెట్టిన దుండగులు
  • జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బిష్ణుపూర్​ పోలీసులు

ఇంఫాల్,న్యూఢిల్లీ: మణిపూర్​లో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను బాధితులు బయటపెడు తున్నారు.  వైద్యుల కౌన్సెలింగ్, అధికారుల ప్రోత్సాహంతో జరిగిన దారుణాలపై ఫిర్యాదు చేస్తున్నారు. అల్లర్లు చెలరేగిన రోజున గ్యాంగ్ రేప్​కు గురైన బాధితురాలు ఒకరు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. మే 3న సాయంత్రం తనపై ఐదారుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు. చురాచాంద్​పూర్ జిల్లాలోని తన ఇంటిని తగులబెట్టారని, తాను, తన పిల్లలతో పాటు వదిన, ఆమె పిల్లలు పారిపోతుండగా ఈ దారుణం జరిగిందని చెప్పారు. బిష్ణుపూర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పడిపోవడంతో దొరికిపోయా..
పిల్లలతో కలిసి పరిగెడుతుండగా తాను బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డానని, లేచి పరిగెట్టే ప్రయత్నం చేస్తుండగానే ఐదారుగురు వ్యక్తులు తనను చుట్టుముట్టారని బాధితురాలు తెలిపారు. తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటన తర్వాత తన ఆరోగ్యం బాగా పాడైందని వివరించారు. జరిగిన దారుణాన్ని బయటకు చెబితే కుటుంబ గౌరవానికి మచ్చ ఏర్పడుతుందని, చుట్టుపక్కల వారు తమ కుటుంబాన్ని చులకన చేస్తారనే భయంతో ఈ దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయానని కన్నీటిపర్యంతమయ్యారు. తనలో తానే కుమిలిపోతుండడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు.

వైద్యుల కౌన్సెలింగ్..
ఆసుపత్రిలో వైద్యులు కౌన్సెలింగ్​ చేశారని బాధితురాలు తెలిపారు. ఉన్నతాధికారులు ధైర్యం చెప్పడం, బాధితులు చాలామంది పోలీసులను ఆశ్రయించడంతో తాను కూడా ఫిర్యాదు చేయడానికి వచ్చానని వివరించారు. ‘నా తప్పేమీ లేకున్నా నాపై ఇంత దారుణానికి పాల్పడిన వారికి శిక్ష పడాలనే ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశా.. లైంగికంగా, శారీరకంగా నన్ను వేధించిన వాళ్లను కఠినంగా శిక్షించాలి’ అంటూ బాధితురాలు డిమాండ్​ చేశారు.