అంతర్వేది లక్ష్మినరసింహస్వామి రథం మంటల్లో దగ్ధం

అంతర్వేది లక్ష్మినరసింహస్వామి రథం మంటల్లో దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా: సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలోని రథం మంటల్లో దగ్ధమైంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాచీన రథానికి నిన్న అర్ధరాత్రి దాటిన సమయంలో మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందిని రప్పించేలోపే మంటలు పెద్దవై రథం చాలా వరకు కాలిపోయింది. అగ్నికుల క్షత్రియుడు, ఆలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మ నిర్మించిన ఈ రథం చాలా పురాతనమైనది.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసి.. విచారణకు ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి

అంతర్వేదిలోని లక్ష్మి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని రథం నిన్న రాత్రి అగ్నికి ఆహుతైన విషయం తెలిసిన వెంటనే ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి స్పందించారు. దేవాదాయశాఖ కమిషనర్ అర్జున్ రావు,  జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ చేసి మాట్లాడారు. ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి వాస్తవాలు వెలికి తీయాలంటూ..దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ ను విచారణ అధికారిగా నియమించారు. ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ప్రమాదానికి కారణాలు నిర్ధారణ చేయాలని ఆదేశించారు. రథం పునర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.