రూ.93 లక్షల కోట్లకు ఆంత్రోపిక్ వాల్యూ... 965 బిలియన్ డాలర్లకు చేరిన కంపెనీ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌

రూ.93 లక్షల కోట్లకు ఆంత్రోపిక్ వాల్యూ... 965 బిలియన్ డాలర్లకు చేరిన కంపెనీ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌
  • ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఏఐని వెనక్కి నెట్టి అత్యంత విలువైన ఏఐ కంపెనీగా అవతరణ

న్యూఢిల్లీ: ఆంత్రోపిక్ అత్యంత విలువైన ఏఐ కంపెనీగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా 65 బిలియన్ డాలర్లను సుమారు ట్రిలియన్ డాలర్ల (965 బిలియన్ డాలర్ల– దాదాపు రూ.93 లక్షల కోట్ల) వాల్యుయేషన్ వద్ద సేకరించింది. తన ప్రత్యర్థి కంపెనీ ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఏఐని (852 బిలియన్ డాలర్లు) వెనక్కి నెట్టింది. 2021లో కేవలం నలుగురు మాజీ ఓపెన్ ఏఐ ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌తో మొదలైన ఈ కంపెనీ, ప్రస్తుతం ఏఐ రంగంలో దూసుకుపోతోంది. 

కిందటేడాది 47 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించిందని అంచనా. అంతేకాకుండా రానున్న క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదటిసారిగా లాభాల్లోకి రానుంది.   ఆంత్రోపిక్ త్వరలో ఐపీఓకి రావాలని చూస్తోంది. కంపెనీ డెవలప్ చేసిన క్లాడ్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌, కోవర్క్ వంటి టూల్స్‌‌‌‌‌‌‌‌ గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా అనేక సంస్థలను ఆకర్షిస్తున్నాయి. సుమారు  5,000 కంపెనీలు క్లాడ్‌‌‌‌‌‌‌‌ను వాడుతున్నాయని ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ సెకోవియా క్యాపిటల్ భాగస్వామి ఆల్ఫ్రెడ్ లిన్ తెలిపారు.

తక్కువ మంది ఉద్యోగులతోనే..

ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూకి చేరువవుతున్నప్పటికీ, ఆంత్రోపిక్ చాలా తక్కువ మంది ఉద్యోగులతోనే నడుస్తోంది.  సాంప్రదాయ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ లేదా టెక్ దిగ్గజాలతో పోలిస్తే, ప్రతి ఉద్యోగి ద్వారా ఈ సంస్థ సృష్టిస్తున్న రెవెన్యూ రేటు  టెక్నాలజీ చరిత్రలోనే అత్యధికంగా ఉంది.  2024 లో 800 మందితో నడిచిన ఈ కంపెనీలో ప్రస్తుతం 5 వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. 

అదే ఇండియన్ ఐటీ కంపెనీలు టీసీఎస్‌‌‌‌‌‌‌‌ (6 లక్షల మంది), ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌ (3.28 లక్షల మంది), విప్రో (2.42 లక్షల మంది) తో పోలిస్తే ఈ నెంబర్ చాలా తక్కువ. ఈ కంపెనీల మార్కెట్‌‌‌‌‌‌‌‌ క్యాప్ కూడా ఆంత్రోపిక్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే చాలా రెట్లు తక్కువగా ఉంది. టీసీఎస్‌‌‌‌‌‌‌‌ మార్కెట్ విలువ 86–89 బిలియన్ డాలర్లు ఉండగా, ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌ 49 బిలియన్ డాలర్లు, విప్రో 22 బిలియన్ డాలర్ల దగ్గర ఉన్నాయి.