హైదరాబాద్ అమీర్‌పేట్ లోని ఓ గర్ల్స్ హాస్టల్ వేదికగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లేడీస్ హాస్టల్ ముసుగులో నిర్వాహకులు తప్పుడు పనులు చేస్తున్నారంటూ ఓ యువతి బయటపెట్టిన నిజాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సురక్షితం అనుకున్న హాస్టల్ లో అసాంఘిక పనులకు అడ్డాగా మార్చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తమ హాస్టల్‌లో జరుగుతున్న దారుణాలను వివరించడమే కాకుండా, తనకు ఎదురైన చేదు అనుభవాలను ఒక వీడియో ద్వారా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఆ యువతి. హాస్టల్ నిర్వాహకుల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని, అమాయకపు యువతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.
మాకు రక్షణ కల్పించండి.. ఆ అసాంఘిక కేంద్రంపై చర్యలు తీసుకోండి అంటూ పోలీసులను వేడుకుంటోంది ఆ బాధితురాలు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లోతైన దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.నమ్మకంతో హాస్టల్స్‌కు పంపే తల్లిదండ్రులు.. ఇప్పుడు ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు.
