ఏ ఎన్నికలకైనా సిద్ధం గల్లీలో, ఢిల్లీలో బీఆర్ఎస్‌‌కే

ఏ ఎన్నికలకైనా సిద్ధం గల్లీలో, ఢిల్లీలో బీఆర్ఎస్‌‌కే
  • అనుకూలంగా పరిస్థితులు: కేటీఆర్ 
  • జూబ్లీహిల్స్‌‌లో బంపర్‌‌‌‌ మెజార్టీతో గెలుస్తం 
  • మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: ఏ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ అన్నారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు మేం రెడీగా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కే అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.

 రాష్ట్రంలోని అన్ని వర్గాలూ మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నాయి. 2023 ఎన్నికల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆనాడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా మాగంటి గోపినాథ్ ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునీతను ప్రజలు బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. 

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ప్రదీప్​చౌదరితో పాటు పలువురు లీడర్లు సోమవారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​మోసాలను ఎండగట్టి, రేవంత్​సర్కార్​భరతం పట్టే బ్రహ్మస్త్రమే బాకీ కార్డు ఉద్యమమని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఇచ్చిన హామీలను ప్రజలు మరచిపోయారని కాంగ్రెస్​నేతలు భ్రమపడుతున్నారు. కానీ ప్రజలు అన్నీ గుర్తుంచుకున్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించాం. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారింది. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తుంది” అని అన్నారు. 

హైదరాబాద్​ ఆగమైతుంటే కొత్త నగరం కడ్తరంట..

హైదరాబాద్ సిటీ సమస్యలతో ఆగమాగవుతుంటే సీఎం మాత్రం కొత్త నగరం కడతానంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారని కేటీఆర్ ​విమర్శించారు. ‘‘ఉన్న నగరాన్ని ఉద్ధరించలేనివారు కొత్త నగరం కడతామని పోజులు కొట్టడం హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌లు నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. కనీసం ఉన్న రోడ్లను కూడా సరిగా నిర్వహించడం లేదు” అని మండిపడ్డారు. 

‘‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆగ్రహంగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం రైతులు యుద్ధాలు చేసే దుస్థితి ఉండేది. ఇప్పుడు మళ్లీ అవే రోజులు దాపురించాయి. ఎరువుల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టే, ప్రాణాలు కోల్పోయే దారుణ పరిస్థితులు వచ్చాయి” అని వ్యాఖ్యానించారు. తెలుగువారి ఖ్యాతిని యావత్​దేశానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అయితే, తెలంగాణ అస్తిత్వ పతాకాన్ని, సత్తాను హిమాలయాల స్థాయిలో ఎగరేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు.