- రైతులకు అవగాహన కల్పించి, ప్రోత్సహించనున్న వ్యవసాయ శాఖ
- ఈ విధమైన సాగుతో ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చు, రసాయన నియంత్రణ
- మట్టి సారవంతంతో ఎక్కువ ఆదాయం వస్తుందన్న అగ్రికల్చర్ నిపుణులు
హైదరాబాద్, వెలుగు: సహజ సాగు పద్ధతుల్లో మల్టీ క్రాపింగ్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. రసాయనాల వాడకం లేకుండా ‘సహజీవన సాగు’ (కంపానియన్ ప్లాంటింగ్) గురించి రైతులకు అవగాహన కల్పించనుంది. ఈ పద్ధతి సాగులో కూరగాయల తోటలకు కీటకాల నుంచి రక్షణ ఇవ్వడమే కాకుండా పంట దిగుబడిని పెంచుతుంది. రసాయన ఎరువులు, పురుగు మందుల్లేకుండా సహజంగా పండించాలంటే ఈ పద్ధతి బెస్ట్ అని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, తోటలను ఆరోగ్యవంతంగా ఉంచుతుందని చెబుతున్నారు.
వ్యవసాయ శాఖ ఈ సాగును ప్రోత్సహించి సుస్థిర వ్యవసాయానికి మార్గం సుగమం చేస్తోంది. కాగా, రెండు, మూడు వేర్వేరు పంట మొక్కలను పక్కపక్కనే పెంచడాన్ని సహజీవన సాగు అంటారు. గతంలో పెరటి తోటలు, కిచెన్ గార్డెన్లలో ఈ పద్ధతి సాగు సాధారణంగా జరిగేది. ఇప్పుడు పెద్ద ఎత్తున సాగు చేసే రైతులకు ఇది ఉపయోగపడుతుందని అగ్రికల్చర్ అధికారులు అంటున్నారు. వ్యవసాయ శాఖ ఇప్పుడు రైతులకు శిక్షణా కార్యక్రమాలు, సలహాలు ఇచ్చి మల్టీ క్రాపింగ్ సాగును ప్రోత్సహించనుంది.
మల్టీ క్రాపింగ్‌తో ప్రయోజనాలు..
మల్టీ క్రాపింగ్ సాగు పద్ధతిలో రసాయనాల అవసరం లేకుండా పంటలను కాపాడుతుంది. కీటకాల నుంచి రక్షణ ఉంటుంది. పురుగులు సహజంగా తగ్గుతాయి, మందులు వేయాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. మట్టి సారవంతం అవుంతుంది. స్థల ఆదాతో ఒకే భూమిలో ఎక్కువ పంటలు వేయొచ్చు. దిగుబడి పెరుగుతుంది. కలుపు, నేల కోత తగ్గుతుంది.
ఆకులు మట్టిని కప్పి తేమను కాపాడుతాయి. పంట పెంపుదలతో మొత్తం కూరగాయల తోటలు ఆరోగ్యంగా మారి పంట పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని అధికారులు అంటున్నరు.
ఏ పంటలు కలిపి వేయాలంటే..
- టమాటా, తులసి: తులసి మొక్క టమాటా దిగువ భాగంలో పెరిగి, వైట్‌ఫ్లై, అఫిడ్స్ వంటి పురుగులను తరిమేస్తుంది. టమాటా రుచి కూడా మెరుగవుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది.
- వంకాయ, బీన్స్, మారిగోల్డ్ (బంతి పువ్వు): బీన్స్ మట్టికి నైట్రోజన్ ఇస్తుంది, మారిగోల్డ్ నెమటోడ్స్ (మట్టి పురుగులు) తరిమేస్తుంది. ఫలితంగా వంకాయ పంట ఆరోగ్యంగా దిగుబడి వస్తుంది.
- క్యారెట్, ఉల్లి: ఉల్లి వాసనతో క్యారెట్ ఫ్లైస్‌ను దూరం చేస్తుంది. అదే సమయంలో క్యారెట్ ఉల్లిగడ్డలకు రక్షణ ఇస్తుంది. ఇది పరస్పర రక్షణ జోడీగా అధికారులు చెబుతున్నరు.
- క్యాబేజీ, సోంపు (డిల్): సోంపు మొక్కలు పరాన్నజీవి కీటకాలను ఆకర్షిస్తాయి, ఇవి క్యాబేజీ పురుగులను తింటాయి. తెల్ల సీతాకోకచిలుకల నుంచి సహజ రక్షణకు ఉపయోగపడతాయి.
- మొక్కజొన్న, బీన్స్, గుమ్మడికాయ: ఇది ప్రపంచ ప్రసిద్ధ ‘త్రీ సిస్టర్స్’ పద్ధతి. మొక్కజొన్న కాండాలు బీన్స్‌కు ఆసరా ఇస్తాయి, బీన్స్ నైట్రోజన్ ఇస్తుంది, గుమ్మడి ఆకులు మట్టిని కప్పి కలుపు తగ్గిస్తాయి. రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఇది బాగా పని చేస్తుంది.
- బ్రకోలీ, పొద్దుతిరుగుడు: పొద్దుతిరుగుడు ఎత్తుగా పెరిగి నీడ ఇస్తుంది, బ్రకోలీ పూలు ఎండలో వేగంగా పూయకుండా కాపాడుతుంది.
- దోసకాయ, నాస్టూర్టియమ్: నాస్టూర్టియమ్ పురుగులను ఆకర్షించి, దోసకాయను సంరక్షిస్తుంది.
- బటానీ, పుదీనా: పుదీనా వాసనతో అఫిడ్స్‌ను తరిమేస్తుంది. కానీ పుదీనాను కుండీలోనే పెంచండి, లేకపోతే తోట మొత్తం ఆక్రమిస్తుంది.
అలాగే, మిర్చి, కొత్తిమీర, బెండకాయ, పొద్దు తిరుగుడు, ఆలుగడ్డ, ముళ్లంగి, బంతిపూలు, ఉల్లి తోట వంటి పంటను సహజీవన పద్ధతిలో పెంచి, మొక్కలకు పురుగులను సహజంగానే తరిమేస్తాయి.
