క్యాష్ లెస్ హెల్త్ స్కీమ్ లో సర్కార్ పెత్తనం వద్దు!

క్యాష్ లెస్ హెల్త్ స్కీమ్ లో  సర్కార్ పెత్తనం వద్దు!
  •     ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసే 1.5 శాతం నిధులపై స్పష్టత ఇవ్వాలి
  •     జీపీఎఫ్, టీజీజీఎల్​ఐ నిధుల మాదిరి వేరే అవసరాల కోసం డైవర్ట్ చేయొద్దు
  •     ఆ హామీ ఉంటేనే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కి ఒప్పుకుంటామని  ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన క్యాష్‌లెస్‌ హెల్త్ స్కీమ్‌పై ఉద్యోగ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల ప్రాథమిక వేతనం ( బేసిక్​ పే) నుండి ప్రతి నెలా 1.5 శాతం నిధులను మినహాయించి, దాని ద్వారా పూర్తి స్థాయి నగదు రహిత వైద్య సేవలు అందించాలన్నది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఈ ప్రతిపాదనపై ఉద్యోగులు ప్రాథమికంగా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ప్రధాన ఆందోళనంతా తమ జీతాల నుంచి కట్ అయ్యే నిధుల నిర్వహణపైనే ఉంది. 

ప్రస్తుతం అమల్లో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్​), తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి పథకాల ద్వారా నిధులు క్రమంగా మినహాయిస్తున్నా అవసరమైన సమయానికి రుణాలు మంజూరు కావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. పదవీ విరమణ పొందిన వారికి అందాల్సిన సెటిల్మెంట్లు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంచుతోంది. ఈ పాత నిధులు ఏయే అవసరాలకు వినియోగిస్తున్నారో, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని  గుర్తు చేస్తున్నారు.

నిధులు ఆగితే వైద్యం ఆగుతుందనే ఆందోళన

ఈ పథకం అమలులో భాగంగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే నిర్ణయించారు. ఈ కమిటీలో ఉద్యోగుల ప్రతినిధులుగా ఆరుగురు సభ్యులు, పెన్షనర్ల తరపున ఇద్దరు సభ్యులు ఉంటారు. అదనంగా ఈ పథకం కార్యకలాపాల పర్యవేక్షణకు ప్రభుత్వ ఉద్యోగులలో ఒకరిని సీఈవోగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విధానంలో ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పే నుండి 1.5 శాతం కంట్రిబ్యూషన్‌గా తీసుకుంటే, దానికి సమానమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాగా జమ చేయనుంది.  

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన దాదాపు 515 హాస్పిటల్స్​ను ఈ పథకం పరిధిలోకి తీసుకురావడానికి గుర్తించారు. అయితే  ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే  వైద్య సేవలు అందవని, ‘నిధులు లేవు’ అనే సమాధానం వినాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈహెచ్ఎస్ స్కీంలో అలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. నూతన ఆరోగ్య పథకం కోసం కేటాయించే 1.5 శాతం నిధులు వైద్య అవసరాలకే వినియోగిస్తారా లేదా అన్నది  కీలక ప్రశ్నగా మారింది. 

ఈ నిధులను ఇతర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు లేదా పరిపాలనా పరమైన అవసరాలకు మళ్లిస్తారేమోనన్న భయం ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ హెల్త్ ఫండ్‌ను ఒక ప్రత్యేక అకౌంట్‌లో ఉంచి, దానికి చట్టబద్ధమైన గ్యారెంటీ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

అత్యవసర వైద్య పరిస్థితి తలెత్తి ఆస్పత్రిలో చేరినప్పుడు, నిధుల కొరత నెపంతో చికిత్సకు ఆటంకం కలగకూడదని  కోరుకుంటున్నారు. ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతే ప్రభుత్వ పథకం కంటే తమకు నచ్చిన ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడమే మంచిదని కొంతమంది ఉద్యోగులు అభిప్రాయపడుతున్నరు. నిధుల మళ్లింపు జరగదని, ఆస్పత్రి బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండదని ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే 1.5 శాతం వేతన కోతకు తాము అంగీకరిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.