ఏపీ: ఫించను రద్దయిన వారికి మళ్లీ దరఖాస్తుకు ఛాన్స్

 ఏపీ: ఫించను రద్దయిన వారికి మళ్లీ దరఖాస్తుకు ఛాన్స్

అమరావతి: రాష్ట్రంలో ఫించన్లు పొందుతున్న వారికి వివిధ కారణాలతో రద్దయి ఉంటే అలాంటి వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. తమ ఫించన్లను అకారణంగా రద్దు చేశారని.. నవశకం సర్వేలో తమను అనర్హులుగా గుర్తించి రద్దు చేశారని..  అన్ని అర్హతలున్న తమకు ఫించను పునరుద్ధరించాలంటూ.. అనేక మంది ప్రతి సోమవారం జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. రద్దయిన వాటిలో అర్హులైన వారుంటే తిరిగి పునరుద్ధరించాలంటూ ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది.
సచివాలయ పోర్టల్ లో తిరస్కరణకు గురైన వారికి కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది ప్రభుత్వం. అలాగే శఆశ్వతంగా వలస వెళ్లినవారు, నవశకం సర్వేలో అనర్హులుగా గుర్తించిన వారు అర్హులై ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులతో అర్హులైన వారి ఆధార్ కార్డుల ఆధారంగా అర్హతలను మళ్లీ పరిశీలించాలంటూ ఉత్తర్వులిచ్చింది. ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ల ఆమోదం తర్వాత కొత్త దరఖాస్తులకు అవకాశం కల్పించేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.