
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఇవాళ(సెప్టెంబర్ 24) రెండోరోజు టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ విచారణ విచారిస్తోంది. కాసేపటి క్రితమే జైల్లోనే చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. సెప్టెంబర్ 23న రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉదయం తొమ్మదిన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకూ.. బాబును ప్రశ్నించారు. 6 గంటల పాటు జరిగిన విచారణలో స్కిల్ స్కాంలో కీలక విషయాలపై ప్రశ్నలు అడిగారు అధికారులు. మధ్యలో గంట సేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు తరపు లాయర్ సమక్షంలో విచారణ జరిగింది. నిన్నటి విచారణలో మొత్తం 12 మంది సీఐడీ అధికారులు పాల్గొన్నారు.
ఈ స్కిల్ స్కాం కేసులో మొత్తం 371 కోట్ల కుంభకోణం జరిగిందనీ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇందులో జీఎస్టీ తీసేయగా.. 301 కోట్లు మనీ ట్రాన్జాక్షన్స్ గా జరిగాయంటున్నారు. 60 కోట్ల రూపాయలు నిజంగానే స్కిల్ డెవలప్ మెంట్ కోసం ఖర్చు చేసినా.. మిగతా 241 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలని చంద్రబాబుని CID అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
మొత్తం ఈ ప్రాజెక్టు విలువ ఎంత? ఈ ప్రాజెక్టు విలువ గుజరాత్ కంటే ఏపీలో ఎందుకు ఎక్కువగా ఉంది? కాంట్రాక్ట్ ను ఏ ప్రాతిపదికన ఇచ్చారు? సబ్ కాంట్రాక్టులను ఎలా ఇచ్చారు? నిధుల విడుదలపై మీరు ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చారా? ఈ ఫైల్ లోని 13 సంతకాలు మీరే చేశారా? వంటి ప్రశ్నలను సీఐడీ అధికారులు అడిగినట్లు సమాచారం. నిన్న చంద్రబాబు చెప్పిన ఆన్సర్స్ ఆధారంగా.... సీఐడీ అధికారులు ఇవాళ కొత్త ప్రశ్నల్ని రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇవాల్టి విచారణలో మరిన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకుంది సీఐడీ. ఈ ప్రశ్నలకు వచ్చే ఆన్సర్స్ ను బట్టి.. ఆయన్ని మరిన్ని రోజులు కస్టడీలోకి అడగాలా ? ఇక్కడితో విచారణ ముగించాలా అనేది సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నారు సీఐడీ అధికారులు. మరిన్ని రోజులు ప్రశ్నించాలి అనుకుంటే, మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఐడీ అధికారులు కోరాల్సి ఉంది.
ఇక.. సెప్టెంబర్ 25న చంద్రబాబును సీఐడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు ప్రవేశ పెడతారు. రిమాండ్ పొడిగించాలా వద్దా అనే దానిపై జడ్జి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను కోర్టు రేపు ఎంక్వైరీ చేయనుంది. అలాగే చంద్రబాబుపై అమరావతి రాజధాని రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లపై కూడా రేపే విచారణ చేయనుంది.