- వచ్చే పుష్కరాల లోపు పోలవరం పూర్తి చేసి తీరుతాం : ఏపీ సీఎం చంద్రబాబు
- గోదావరి జలాలను కృష్ణానదితో కలిపాం
- గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమకు నీళ్లిచ్చాం
- రాష్ట్ర సాగునీటి కష్టాలకు పోలవరంతో శాశ్వత పరిష్కారమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని అనంతపురం జిల్లాకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 70 టీఎంసీల నీటిని మళ్లించామని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా, గోదావరి జలాలను రాయలసీమకు తెచ్చి రైతులను ఆదుకున్నామని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును వచ్చే పుష్కరాల లోపు (2027 నాటికి) పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి కష్టాలు తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురం జిల్లా యాడికిలో సీఎం పర్యటించారు.
ఈ సందర్భంగా సాగునీటి సంఘాలు, రైతులతో నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు."ఒకప్పుడు చుక్క నీటి కోసం అల్లాడిన అనంతపురం జిల్లాకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 70 టీఎంసీల నీటిని మళ్లించి చరిత్ర సృష్టించాం. నదుల అనుసంధానం అనే సంకల్పంతో గోదావరి జలాలను కృష్ణమ్మతో కలిపాం. కాబట్టే, శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను హంద్రీ-నీవా ద్వారా మీ పొలాలకు పారించగలిగాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా, గోదావరి జలాలను రాయలసీమకు తెచ్చి రైతులను కడుపులో పెట్టుకుని ఆదుకున్నాం. ఇక రాష్ట్రానికే తలమానికమైన పోలవరం ప్రాజెక్టుపై నా మాట ఇస్తున్నాను.. వచ్చే పుష్కరాల లోపు పోలవరాన్ని పూర్తి చేసి తీరుతాం. ఆ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరిపోతాయి. సాగునీటి సంఘాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రతి చుక్క నీటిని పొదుపుగా వాడుకుంటేనే 'రతనాల సీమ. జిల్లాను అంతర్జాతీయ ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతాం" అని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఖరీఫ్‌కు 547 టీఎంసీలు, రబీకి 343 టీఎంసీలు నీరు అవసరమవుతుందని తెలిపిన సీఎం.. పరిశ్రమలకు 28, తాగు నీటికి 158 టీఎంసీల చొప్పున మొత్తంగా 1,300 టీఎంసీలు రాష్ట్రానికి అవసరం అవుతాయని తెలిపారు. హార్టికల్చర్‌లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు.
