కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను నేనే పూర్తిచేసిన : ఏపీ సీఎం చంద్రబాబు

కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను నేనే పూర్తిచేసిన : ఏపీ సీఎం చంద్రబాబు
  •     కాళేశ్వరం నిర్మాణానికి నేనెప్పుడూ అడ్డు చెప్పలే: ఏపీ సీఎం చంద్రబాబు
  •     జల వివాదాల శాశ్వత పరిష్కారమే నా లక్ష్యం
  •     కృష్ణా- గోదావరి నదుల అనుసంధానం జరుగుతుందని వెల్లడి

హైదరాబాద్ , వెలుగు: సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్‌‌ఎల్‌‌బీసీ, ఎస్ఆర్‌‌‌‌బీసీ కాలువలు తెచ్చారని, ఆ తర్వాత తానే సీఎంగా కల్వకుర్తి లిఫ్ట్, నెట్టెంపాడులాంటి ప్రాజెక్టులను పూర్తి చేశానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.  తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలు శాశ్వతంగా పరిష్కారం కావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.  రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.   

సోమవారం ఏపీలోని గుంటూరు  సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్  నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో చంద్రబాబు మాట్లాడారు. సాగునీటి వ్యవస్థకు దారి చూపింది ఎన్టీఆర్ అని, ఆయన  హయాంలో ఉమ్మడి ఏపీలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. 

“కృష్ణా డెల్టా ఆధునీకరణతో నీటిని పొదుపు చేశాం. 20 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. గోదావరి నదిపై అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతలలాంటి పథకాలను చేపట్టాం. ఆంధ్రా ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడిలాంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తెచ్చాం. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు అందించాం. ప్రతి ఏడాది గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నది. నిరుడు కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీళ్లను తెలంగాణ వాడుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదు.

ఏపీలో నదులను అన్నింటినీ అనుసంధానించాలి. కృష్ణా-–గోదావరి నదుల అనుసంధానం జరుగుతుంది. విభజన తర్వాత పోలవరానికి ప్రత్యేక నిధులిచ్చారు. ప్రత్యేక చట్టం రూపొందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదు. నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి ఉండాలి”  అని వ్యాఖ్యానించారు.