మీ తలుపు తట్టి పింఛను ఇస్తాం: సీఎం జగన్‌

మీ తలుపు తట్టి పింఛను ఇస్తాం: సీఎం జగన్‌

కడప: కడప గడప నుంచి నవరత్నాల అమలుకు మరోసారి శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో మాట్లాడుతూ.. ‘‘ సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి మీ తలుపు తట్టి పింఛను ఇస్తారు. అదే రోజు నుంచి గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ఇంటికి వచ్చి వివరిస్తారు. గ్రామ వాలంటీర్లు ఎవరూ లంచం తీసుకోరు. ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫిర్యాదు చేయవచ్చు” అని అన్నారు.

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల లోపే వృద్ధాప్య పింఛనును రూ.2,250కు పెంచామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5.4లక్షల పింఛన్లు మంజూరు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి వైఎస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతామని సీఎం తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు సీఎం. రైతుల పంట రుణాల కోసం కేవలం ఈ ఏడాదికి రూ.84 వేల కోట్లు రుణాలు అందించాలని నిర్ణయించాం. పంట రుణాలు తీసుకున్న రైతులు నిర్ణీత గడువులోగా తిరిగి చెల్లిస్తే వాటిపై ఏమాత్రం వడ్డీ చెల్లించనక్కర్లేదన్నారు. పలు కారణాల వల్ల  నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకుంటామని, అన్నదాతలకు తోడుగా వైఎస్‌ఆర్‌ భరోసా పథకం తీసుకొచ్చామని తెలిపారు.