ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు వైఖరి దారుణం: జగన్

ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు వైఖరి దారుణం: జగన్

పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునే విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ రోజు జరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన జగన్…  ఇంగ్లీష్ మీడియాన్ని అప్పుడే తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారని అయితే ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా ఉండాలని విచిత్ర వాదన చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో… తెలుగు మీడియంలో 65శాతం, ఇంగ్లీష్ మీడియంలో 35శాతం మంది చదువుకుంటున్నారని. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో.. 94శాతం మంది చదువుకుంటున్నారని చెప్పారు.  చంద్రబాబే దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారని అన్నారు జగన్.

పిల్లలు భవిష్యత్తులో ప్రపంచంతో పోటీపడాలంటే… ఇంగ్లీషును ఒక హక్కుగా నేర్చుకోవాలని అన్నారు జగన్. అదే తపన, తాపత్రయంతో అన్ని స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా చేయడానికి విప్లవాత్మక నిర్ణయం తీసుకువస్తామని ఆయన చెప్పారు.  చంద్రబాబు ఏం చేసినా అందులో రాజకీయం ఉంటుందని ఆయన అన్నారు. ఒకవేల చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు…  పిల్లల బాగు కోరి అన్ని స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం చేస్తే ఆయన్ని ఎవరు ఆపేవారని జగన్ ప్రశ్నించారు. ఈయనా 40ఏళ్ల ఇండస్ట్రీ, ఈయనా మనకు ముఖ్యమంత్రిగా చేశారని రాష్ట్రమంతా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితిలోకి వచ్చిందని జగన్ అన్నారు.