తండ్రి మందలించాడని ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన దోమల్ గూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం ( డిసెంబర్ 28) న బండ మైసమ్మ నగర్ కు చెందిన 15ఏళ్ల కొల్లా అరవింద్ తండ్రి మందలింపుతో మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
బండ మైసమ్మ నగర్ కు చెందిన రాకేష్ , లతల కుమారుడు అరవింద్ స్థానిక స్కూల్ లో పదో తరగతి చదువుతున్నాడు. బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి.. చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన అరవింద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకున్నాడు.గమనించిన కుటుంబ సభ్యులు అరవింద్ ను గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు.
తండ్రి ఫిర్యాదు మేరకు దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలపై అధిక ఒత్తిడి ప్రాణాంతకమవుతోంది.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చిరిస్తున్నారు.
