ఎప్పుడూ రెగ్యులర్ చికెన్ బిర్యానీనేనా..? న్యూ ఇయర్ దావత్ దొన్నె బిర్యానీతో ట్రై చేయండి.. అదిరిపోద్ది..!

ఎప్పుడూ రెగ్యులర్ చికెన్ బిర్యానీనేనా..? న్యూ ఇయర్ దావత్ దొన్నె బిర్యానీతో ట్రై చేయండి.. అదిరిపోద్ది..!

కొత్త ఏడాదికి నోరూరించే రుచులతో స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారా? అయితే నాన్​ వెజ్ ప్రియులకు చికెన్​తో ఫ్రై పీస్ బిర్యానీ, కొత్త రుచి కోరుకునేవాళ్లకు దొన్నె మటన్ బిర్యానీ.. అసలు ముక్కే లేకుండా తినాలనుకుంటే మండి రైస్​. అస్సలు ఆలస్యం చేయకుండా ఇక్కడున్న ఒక్కో రెసిపీని వివరంగా చదివేసి, మీకు నచ్చిన వంటకాన్ని వండేయండి. రాబోయే కొత్త సంవత్సరం వేడుకను రుచికరమైన భోజనంతో స్టార్ట్ చేయండి. 

మండి రైస్.. కావాల్సినవి:

  • బాస్మతి రైస్: 2 కప్పులు, నూనె: ఒక టేబుల్ స్పూన్, మిరియాలు, జీలకర్ర, పసుపు: ఒక్కో టీస్పూన్
  • దాల్చిన చెక్కలు, బిర్యానీ ఆకులు: రెండు, యాలకులు: నాలుగు, లవంగాలు: మూడు, నిమ్మకాయ, నల్ల యాలక: ఒక్కోటి, ఉల్లిగడ్డ తరుగు: అరకప్పు, పచ్చిమిర్చి: మూడు
  • చిల్లీ ఫ్లేక్స్: అర టీస్పూన్, ఎండుద్రాక్షలు: పావు కప్పు, నీళ్లు: సరిపడా, కుంకుమ పువ్వు: చిటికెడు, చికెన్ స్టాక్ క్యూబ్స్: రెండు (ఆన్​లైన్లో దొరుకుతాయి), నేతిలో వేగించిన బాదం, జీడిపప్పు: ఒక టేబుల్ స్పూన్

తయారీ:
ఒక గిన్నెలో బాస్మతీ రైస్ వేసి నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టాలి. పాన్​లో నూనె వేడి చేసి మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్కలు, బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, నిమ్మకాయ, నల్ల యాలకలు, ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తర్వాత పసుపు, చిల్లీ ఫ్లేక్స్, ఎండుద్రాక్షలు వేసి నీళ్లు పోయాలి.

కుంకుమ పువ్వు కలిపిన నీళ్లు, చికెన్ స్టాక్ క్యూబ్స్ వేసి కలపాలి. లేదా చికెన్ ఉడికించిన నీటిని పోయాలి. నీళ్లు బాగా మరిగాక నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. మూతపెట్టి పావుగంట సేపు ఉడికించాలి. తర్వాత మూత తీసి బాదం, జీడి పప్పులు వేయాలి. ఈ రైస్ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. చికెన్, మటన్, ఫిష్..​ ఏ రెసిపీకైనా కాంబినేషన్ అదిరిపోతుంది.

ఫ్రై పీస్ బిర్యానీ.. తయారీ:
పాన్​లో బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస పూలు, యాలకులు, ఎండు మిర్చి, లవంగాలు, మిరియాలు వేసి నూనె లేకుండా వేగించాలి. చల్లారాక వాటిని పొడిలా గ్రైండ్ చేయాలి. అందులో నుంచి ఒక టేబుల్ స్పూన్​ మసాలా పక్కన పెట్టాలి. తర్వాత అందులో జీలకర్ర పొడి వేసి మరోసారి మిక్సీపట్టాలి.

ఒక పాత్రలో నీళ్లు వేడి చేసి అందులో ఉప్పు వేశాక చికెన్​ను వేయాలి. ముక్కలు బాగా ఉడికాక తీసి పక్కన పెట్టాలి. 
పాన్​లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు వేయాలి. అవి వేగాక తర్వాత పసుపు, ఉప్పు, కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి వేగించాలి. ఆపై కరివేపాకు కూడా వేసి కలపాలి. చివరిగా ఉడికించిన చికెన్ ముక్కలు వేయాలి.

గరిటెతో కలుపుతూ కాసేపు వేగనివ్వాలి. మూతపెట్టి పదినిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత తీసి ధనియాల పొడి, మిగిలిన గరం మసాలా, కొత్తిమీర చల్లాలి. రెడీ చేసిపెట్టుకున్న గరం మసాలా వేసి కలపాలి. పాత్రలో నూనె, నెయ్యి వేడి చేసి బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, అనాస పూలు, యాలకులు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కలపాలి. నీళ్లు పోసి ఉప్పు వేసి కలపాలి. ఆ నీళ్లు తెర్లాక నానబెట్టిన బియ్యం వేసి మూతపెట్టి ఉడికించాలి. మధ్యలో ఒకసారి గరిటెతో కలిపి, మళ్లీ పది నిమిషాలపాటు ఉడికించాలి. దానిపై చికెన్ ముక్కలు వేయాలి. 

కావాల్సినవి:

  • చికెన్: కిలో, బాస్మతి రైస్: మూడు గ్లాసులు, అనాస పూలు: రెండు
  • బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క: ఒక్కోటి, యాలకులు: నాలుగు
  • ఎండు మిర్చి: పది, లవంగాలు: ఆరు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి: ఒకటిన్నర టీస్పూన్, ధనియాల పొడి: రెండున్నర టీస్పూన్లు
  • ఉల్లిగడ్డలు: మూడు, పసుపు, కారం: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టేబుల్ స్పూన్, నూనె, ఉప్పు: సరిపడా, కొత్తిమీర: కొంచెం, నీళ్లు: ఐదు గ్లాసులు


దొన్నె బిర్యానీ.. తయారీ:
ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన మటన్​ వేసి అందులో పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్​ వేసి బాగా కలిపి మూతపెట్టాలి. మరో పాత్రలో బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, సోంపు, మిరియాలు, యాలకులు, లవంగాలు వేసి అవి వేగాక కొత్తిమీర, పుదీనా వేయాలి. చల్లారాక వాటిని మెత్తగా గ్రైండ్ చేయాలి.  మరో పాన్​లో నూనె వేడి చేసి అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు,  పచ్చిమిర్చి వేసి  వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ, టొమాటో తరుగు వేసి కలపాలి. వాటిని కూడా మిశ్రమంలో వేసి మరోసారి గ్రైండ్ చేయాలి.

ప్రెజర్ కుక్కర్​లో నూనె వేడి చేసి యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా, జాపత్రి వేసి వేగాక అందులో మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలు వేసి కలపాలి. కాసేపయ్యాక గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నీళ్లు పోసి బియ్యం వేసి నిమ్మరసం చల్లాలి. నెయ్యి కూడా వేసి మరోసారి కలపాలి. మూతపెట్టి ఉడికించాలి.

కావాల్సినవి:

  • మటన్: అర కిలో
  • పెరుగు, నెయ్యి: ఒక్కోటి మూడు టేబుల్ స్పూన్లు
  • పసుపు: అర టీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, సోంపు: ఒక టీస్పూన్
  • ధనియాల పొడి: రెండు టీస్పూన్లు
  • బియ్యం (చిట్టిముత్యాలు): రెండు గ్లాసులు
  • మిరియాలు, జీలకర్ర: ఒక్కోటి అర టీస్పూన్
  • బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క: ఒక్కోటి 
  • యాలకులు: నాలుగు
  • లవంగాలు: ఐదు
  • పుదీనా, కొత్తిమీర: కొంచెం
  • నూనె: ఒక టేబుల్ స్పూన్
  • అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు: ఐదేసి చొప్పున
  • పచ్చిమిర్చి: నాలుగు
  • ఉల్లిగడ్డ తరుగు: పావు కప్పు
  • టొమాటోలు: రెండు
  • నిమ్మకాయ: ఒకటి