నటుడు శివాజీ (Shivaji ).. మహిళా కమీషన్ విచారణ అనంతరం కీలక విషయాలు వెల్లడించారు. డిసెంబర్ 27, 2025న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట శివాజీ విచారణకు హాజరయ్యి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అయితే, శివాజీ వాఖ్యల వల్ల భాధపడ్డవారి తరుపున కమిషన్ ప్రశ్నలు వేసి, ఆయన స్టేట్‌మెంట్ను రికార్డ్ చేసుకుంది. ఈ క్రమంలో మహిళా కమిషన్ విచారణ అనంతరం, నటుడు శివాజీ తనపై జరుగుతున్న విమర్శలపై స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మహిళలను అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
“నేను ఎవరినీ నొప్పించాలని మాట్లాడలేదు. సంస్కృతి గురించి చెప్పాలన్న ఉద్దేశం మాత్రమే ఉంది. కానీ నా మాటలు వక్రీకరించబడ్డాయి” అని శివాజీ తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు. అలాగే, “నేను ఏం తప్పు చేసానని నా మీద ఇంత కోపం చూపిస్తున్నారు” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పినందుకు ఇంత పెద్ద వివాదం చేయడం బాధాకరమని అన్నారు.
అయితే, భారతీయ మహిళల సంప్రదాయం, సంస్కృతి ప్రపంచానికి దేశాన్ని గుర్తింపజేస్తుందని తన ఉద్దేశం అని తెలిపాడు. ఎందుకంటే, “180 దేశాలు నిలబెట్టి… సారి కట్టుకున్న వారిని చూసి ‘ఇది భారత దేశం’ అని ప్రపంచం గుర్తిస్తుంది” అని శివాజీ వ్యాఖ్యానించాడు. అయితే, ఈ ఉద్దేశ్యంతో పలికిన నా మాటలు వ్యక్తిగత ఎంపికలను తప్పుగా తాకినట్లుగా అనిపించాయని అంగీకరించాడు. అదే వివాదానికి కారణమైందని చెప్పాడు.
అయినా నేను ఏం తప్పు చేసానని నా మీద ఇంత కోపం చూపిస్తున్నారు? మీ అమ్మ నాన్న మీ ఇంట్లో మీకు జాగ్రత్తలు చెప్పరా.. ఎవరి బట్టలు ఎలా వేసుకుంటే నా కేంటి? ఎవరి బట్టలు వారి ఇష్టం. ఇంతకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదా? వారి మీద ఇలానే మాట్లాడారా..? అని కూడా ప్రశ్నించారు శివాజీ.
ఇదే సమయంలో తనపై బ్యాక్ గ్రౌండ్లో జరుగుతున్న మరికొన్ని కీలక విషయాలు పంచుకున్నారు శివాజీ. తనపై కావాలనే సినీ ఇండస్ట్రీలో ఓ వర్గం కుట్ర పన్నుతుందని, నా వాఖ్యల తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాలని కొందరు జూమ్ మీటింగ్ సైతం పెట్టుకుని చర్చిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. కానీ, తాను ఎవరికీ భయపడనని, ఇక్కడ కాకపోతే మరోచోటుకి వెళ్లి వ్యవసాయం చేసుకొని బతుకుతానని అన్నారు.
“సినిమాలే తన జీవితం కాదని, విలువలు, ఆత్మగౌరవం తనకు ముఖ్యమని” శివాజీ స్పష్టంగా వెల్లడించారు. మొత్తానికి తాను అన్నమాటల్లో తప్పుడు ఉద్దేశ్యం లేదని, మహిళా కమిషన్ ముందు హాజరై వచ్చిన తర్వాత శివాజీ మాట్లాడిన మాటలు బట్టి అర్ధం అవుతుంది.
