చెడిపోయిన వ్యవస్థను బాగుచెయ్యాలి: జగన్

చెడిపోయిన వ్యవస్థను బాగుచెయ్యాలి: జగన్

ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం వైఎస్‌.జగన్‌ అన్నారు. టెండర్ల విధానాన్ని అత్యంత పారదర్శకంగా రూపొందించాలని, చెడిపోయిన వ్యవస్థను బాగుచేసుకోవడానికి తాను తపిస్తున్నానని జగన్‌ అన్నారు. శనివారం అమరావతిలోని సీఎం ఆఫీస్ లో అధికారులతో  జగన్ సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో.. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అనేక అవకతవకలను జగన్‌ ప్రస్తావించారు. గత ప్రభుత్వం స్పిల్‌వే పూర్తిచేయకుండా కాఫర్‌ డ్యాంకు వెళ్లిందని, దాన్ని కూడా పూర్తిచేయకుండా వదిలేశారని సీఎం ఆరోపించారు. ఫలితంగా గోదావరిలో వెడల్పు తగ్గిందని, ఇప్పుడు భారీగా వరద వస్తే 4 నెలలపాటు పనులు చేపట్టలేని పరిస్థితి అని అన్నారు జగన్.

ప్రాజెక్టులో అవినీతి పెరిగిందని.. దీనిపై కళ్లు మూసుకోమని తనపై కూడా ఒత్తిడి తెచ్చారని సీఎం అన్నారు. అలాచేయదలుచుకోలేదు కాబట్టే అవినీతిపై పోరాటానికి సిద్ధం అయ్యానన్నారు. ఇలాంటి స్కాంలను, అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. పోలవరం తనకు అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టు అన్నారు. రూ.100ల పని రూ.80లకే పని జరుగుతుందంటే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్దామని జగన్ ఈ సమీక్షలో అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ఎక్కడ చేయగలమో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. పోలవరంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌కు ఎక్కడ అవకాశం ఉందో గుర్తించాలన్నారు.

రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉంది, అవినీతి వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యిందని జగన్ అన్నారు. ఇకపై అలాంటి అవినీతికి తావు లేకుండా పైస్థాయినుంచి కింది స్థాయి వరకూ ఒక మెసేజ్‌ పోవాలన్నారు సీఎం. మన ప్రభుత్వ పారదర్శకత దేశానికి ఒక సంకేతం కావాలన్నారు.