గుంటూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

 గుంటూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

అమరావతి: గుంటూరు వికాస్ నగర్ లో జరిగిన  తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

చంద్రబాబు సభ తర్వాత.. ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమం జరిగింది. కానుకల కోసం బాబు సభకు పెద్దఎత్తున మహిళలు తరలివచ్చారు. అయితే మహిళలు ఒక్కసారిగా రావడంతో గందరగోళం ఏర్పడింది. ఒకరిపై ఒకరు ముందుకు తోసుకురావటంతో తొక్కిసలాట జరిగింది. ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్పందించిన సీఎం జగన్ మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగానిలుస్తుందని  తెలిపారు.

గుంటూరు ఘటనపై గవర్నర్ విచారం

గుంటూరు వికాస్ నగర్ లో జరిగిన  తొక్కిసలాట ఘటన పై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరి కొందరు గాయపడటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.