పిల్లలను బడికి పంపితే

పిల్లలను బడికి పంపితే

తిరుమల, వెలుగు: “ పిల్లలను బడికి పంపితే చాలు ఏటా రూ.15వేలు ఇస్తామని మాటిచ్చా. ఆ మాటను నిలబెట్టుకుంటూ రూ.6,450 కోట్లతో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాం. అమ్మఒడి ద్వారా 43 లక్షలమంది తల్లులు, 82 లక్షలమంది పిల్లలకు లబ్ధిచేకూరుతుంది”అని ఏపీ సీఎం జగన్​ అన్నారు. గురువారం చిత్తూరులో ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  మాట్లాడుతూ…పేదింటి తల్లులు, వారి పిల్లలకు అండగా ఉండేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనన్నారు.  రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఉన్న విద్యను చిన్నారులందరికీ అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు.

ఏటా రూ.15 వేలు జమ.. అప్పుతో సంబంధం లేదు

పిల్లలను బడికి పంపుతున్న ప్రతి పేదింటి తల్లికి ఏటా రూ.15 వేలు అందజేస్తామని జగన్ అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుకునే పిల్లల తల్లుల అకౌంట్‌లో ఈ మొత్తాన్ని జమ చేస్తామని చెప్పారు. బ్యాంకుల్లో అప్పులు ఉన్నా వాటికి ఈ సొమ్మును జమచేయకుండా బ్యాంకర్లతో మాట్లాడామన్నారు. తల్లులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకే ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నామని,  వచ్చే విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం  ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందన్నారు. అర్హత కలిగిన లబ్ది పొందని తల్లులు ఫిబ్రవరి 9లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్

సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు జగన్ చెప్పారు. ఇంగ్లిష్ మీడియంపై ప్రజల ఆకాంక్ష మాజీ సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. ఒక్కో తరగతి చొప్పున ప్రవేశపెడుతూ నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు. నాలుగేళ్లలో పిల్లలు బోర్డు పరీక్షలు ఇంగ్లిష్‌ మీడియంలో రాసే పరిస్థితి తీసుకువస్తామని చెప్పారు. ఈ క్రమంలో తెలుగు మీడియం పిల్లలు ఇబ్బందులను అధిగమించేలా బ్రిడ్జ్ కోర్సులు తీసుకుని వస్తామన్నారు. టీచర్ల కోసం ట్రైనింగ్ కోర్సులు ప్రవేశపెడతామని చెప్పారు. 2040నాటికి మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడికైనా పోటీ పడగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్ మీడియంతోపాటు తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బడుల్లో సిలబస్ మారుస్తామన్నారు. ఇదే సందర్భంగా చిన్నారుల బాగోగులు చూసే ఆయాల జీతాల పెంపు, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మార్పుల గురించి జగన్‌ వివరించారు.