
ఒరిస్సాలోని ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా అవినీతి సొమ్ము పట్టుబడింది. శుక్రవారం ( జులై 25 ) ఒరిస్సాలోని ఆరు వేరువేరు ప్రాంతాల్లో ఓ ఫారెస్ట్ ఆఫీసర్ కి చెందిన ఆస్తులకు సంబంధించి ఆరు వేరువేరు ప్రాంతాల్లో జరిపిన విజిలెన్స్ సోదాల్లో రూ. కోటిన్నర నగదు, 16 గోల్డ్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ రేంజర్ గా పని చేస్తున్న రామచంద్ర నేపక్ కి చెందిన ఆస్తులపై దాడులు నిర్వహించారు అధికారులు.
ఈ దాడుల్లో నేపక్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. మొత్తం రూ. కోటి 44 లక్షల నగదు, ఒక్కొక్కటి 10 గ్రాములు విలువజేసే 16 గోల్డ్ కాయిన్స్, 4 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. జైపూర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లోని అతని ఫ్లాట్ నుండి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. సోదాల్లో పట్టుబడ్డ నగదు లెక్కించటానికి క్యాష్ కౌంటింగ్ మెషిన్ తీసుకురావాల్సి వచ్చిందని తెలిపారు అధికారులు.
అంతే కాకుండా.. నేపక్ కి చెందిన ఆఫీస్, జైపూర్‌లోని అతని పూర్వీకుల భూమిలో నిర్మించిన ఇల్లు, జైపూర్‌లోని నేపక్ అత్తమామల ఇల్లు, భువనేశ్వర్‌లోని అతని సోదరుడి ఫ్లాట్‌లో కూడా సోదాలు నిర్వహించినట్లు తెలిపారు అధికారులు. గత వారం కియోంఝర్‌లోని ఒక డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. అతని పేరు మీద 115 భూమి ప్లాట్లు, 200 గ్రాముల బంగారం, రైఫిళ్లు, కోట్ల విలువైన ఇతర ఆస్తులను గుర్తించారు అధికారులు.