తిరుమలలో దళారులు ఇలా దర్శనం చేయిస్తారా..? ట్యాక్సీ డ్రైవర్లు, క్లీనర్ల దగ్గర వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గేట్ల తాళాలు.. !

తిరుమలలో దళారులు ఇలా దర్శనం చేయిస్తారా..? ట్యాక్సీ డ్రైవర్లు, క్లీనర్ల దగ్గర వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గేట్ల తాళాలు.. !

తిరుమల ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం.. కోట్లాది మంది భక్తులు ఆ శ్రీవారి దర్శనం కోసం నిత్యం వస్తూనే ఉంటారు.. నిత్యం రద్దీ.. లక్షల మంది రాకతో తిరుమల కొండ భక్త జన సంద్రంగానే ఉంటుంది.. దీన్ని అవకాశంగా మార్చుకుని దళారులు ఇప్పుడు అరాచకాలకు పాల్పడుతున్నారు. స్పెషల్ దర్శనం.. ఫ్రీ దర్శనం చేయిస్తాం అంటూ కొండకు వచ్చే భక్తులతో బేరసారాలు చేస్తున్నారు దళారులు. ఈ దళారులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసే సిబ్బంది చేతులు కలిపి.. దోచుకున్న డబ్బులో వాటాలు పంచుకుని.. ఏకంగా తిరుమల కొండ భద్రతనే ప్రమాదంలో నెట్టేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ నమోదు చేసిన కేసు చూస్తే.. ఇలా అయితే తిరుమల కొండనే దళారుల కొండగా మార్చేస్తారు.. స్వామి వారి భద్రతనే కాదు.. భక్తుల భద్రత ప్రమాదంలో పడింది అనే స్థాయికి వచ్చింది. దళారుల గుట్టురట్టు వివరాల్లోకి వెళితే.. 

2025, జూలై 23వ తేదీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం 24 మంది తిరుపతికి వచ్చారు. టోకెన్ కోసం అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్న SSD దర్శనం టోకెన్ల కోసం వేచి ఉన్నారు. అప్పుడు టైం తెల్లవారుజామున 3 గంటలు. ఈ విషయాన్ని గమనించిన ట్యాక్సీ డ్రైవర్లు కె.వెంకటేష్, డి.వెంకటేష్.. వీళ్లిద్దరూ ఆ భక్తులను ట్రాప్ చేశారు. 

ALSO READ : ఆధ్యాత్మికం: సన్ డే ఫన్ డే కాదు... ఆ రోజు ఏంచేయాలి.. ఏం చేయకూడదు..!

క్యూ లైన్లో లేకుండా నేరుగా ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తామని భక్తులను నమ్మించారు. దీని కోసం ఒక్కో భక్తుడి దగ్గర 15 వందల రూపాయలు మాట్లాడుతున్నారు. ఈ మేరకు డబ్బులు కూడా వసూలు చేశారు ఈ ఇద్దరు ట్యాక్సీ డ్రైవర్లు. ఈ 24 మంది భక్తులను వారి వారి వాహనాల్లోనే.. తిరుపతి నుంచి తిరుమల కొండకు తీసుకొచ్చారు. 

కొండపైకి చేరుకున్న తర్వాత.. కొండపైనే వెహికల్ క్లీనర్ గా పని చేస్తున్న వెంకటేష్ ను (ముగ్గురి పేర్లు వెంకటేష్ కావటం విశేషం) కాంటాక్ట్ అయ్యారు. అతనికి 8 వేల 500 రూపాయలు ఇచ్చారు. నేరుగా ఉచిత దర్శనం చేయించాలని చెప్పారు ఈ ఇద్దరు ట్యాక్సీ డ్రైవర్లు. వెహికల్ క్లీనర్ వెంకటేష్ కు.. ఆ 24 మంది భక్తులను అప్పగించి వెళ్లిపోయారు ఆ ఇద్దరు ట్యాక్సీ డ్రైవర్లు. 

ఈ వెహికల్ క్లీనర్ వెంకటేష్.. భక్తుల దర్శనం కోసం టీటీడీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ (PSG) అయిన పి.సాయికుమార్ ను కాంటాక్ట్ అయ్యాడు. 24 మంది భక్తులు ఉన్నారు.. ఉచిత దర్శనానికి క్యూ లైన్ లో పంపించాలి అంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ అయిన సాయికుమార్ తో డీల్ సెట్ చేసుకున్నాడు వెహికల్ క్లీనర్ వెంకటేష్. ఇందుకుగాను సెక్యూరిటీ గార్డు సాయికుమార్ కు 8 వేల రూపాయలు ఇచ్చాడు క్లీనర్ వెంకటేష్.

ఇక్కడే పెద్ద ట్విస్ట్.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 సెక్యూరిటీ గార్డ్ సాయికుమార్.. తన దగ్గర ఉన్న క్యూ లైన్ల తాళాలను.. ఏకంగా క్లీనర్ వెంకటేష్ కు ఇచ్చేశాడు. క్యూ లైన్ తాళాలు తీసుకున్న క్లీనర్ వెంకటేష్.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎమర్జెన్సీ గేట్ తాళాలు ఓపెన్ చేసి.. 24 మంది భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపలికి పంపించాడు క్లీనర్ వెంకటేష్. 

వైకుంఠం క్యూ నుంచి వెళ్లిన 24 మంది భక్తులు.. లోపల ఉచిత దర్శనం టోకెన్ పొంది.. ఉదయం 8 గంటలకల్లా బయటకు వచ్చారు. టోకెన్ లో మధ్యాహ్నం తర్వాత దర్శనం సమయం ఉండటంతో.. ఈ 24 మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం.. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో మళ్లీ క్యూ లైన్ లోకి వచ్చారు. వాస్తవంగా అయితే రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వైకుంఠం 2 దగ్గర టైమింగ్ ఇచ్చి టోకెన్ ఇస్తారు. అక్కడి నుంచే నేరుగా కంపార్ట్ మెంట్లలోకి భక్తులను వదలుతారు. ఈ భక్తులు మాత్రం నేరుగా కంపార్ట్ మెంట్లలోకి వెళ్లకుండా.. బయటకు వచ్చి మళ్లీ దర్శనం సమయానికి రీ ఎంట్రీ అయ్యారు. అది కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లారు.

ఇక్కడే దళారుల బండారం, గుట్టు బయటపడింది. నాలుగు గంటల ముందు.. ఉదయం 8 గంటల సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లిన భక్తులు.. తిరిగి మళ్లీ మధ్యాహ్నం ఎలా ఎంట్రీ అవుతారు.. ఇది ఎలా సాధ్యం అనే అనుమానం అక్కడ ఉన్న సెక్యూరటీ అధికారులకు వచ్చింది. ఎందుకంటే ఉదయం విధుల్లో ఉన్నవాళ్లే అప్పుడూ ఉన్నారు.. దీంతో ఈజీగా గుర్తు పట్టారు అధికారులు. 

ఈ విషయంపై ఆ భక్తులను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దళారుల వ్యవహారమే కాదు.. సెక్యూరిటీ గార్డు దగ్గర ఉండాల్సిన క్యూ లైన్ గేట్ల తాళాలు దళారుల చేతుల్లోకి వెళ్లటం అనే భయంకరమైన నిజం బయపడింది. ఓ వెహికల్ క్లీనర్.. క్యూ లైన్ .. అది కూడా ఎమర్జెన్సీ గేటు తాళాలు ఓపెన్ చేసి మరీ భక్తులను పంపించాడు అంటే ఇది చాలా పెద్ద విషయంగా.. దళారుల రాజ్యంగా.. దళారుల అరాచకంగా మారిందనేది విజిలెన్స్ విచారణలో బయటపడింది. 

ఈ మొత్తం ఘటనపై తిరుమల విజిలెన్స్ అధికారులు.. తిరుమల టూ టౌన్ పోలీసులకు కంప్లయింట్ చేయగా.. ఇద్దరు ట్యాక్సీ డ్రైవర్లు, వెహికల్ క్లీనర్ తోపాటు టీటీడీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ సాయికుమార్ పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. 

దళారుల దోపిడీ అనే ఒక ఇష్యూ అయితే.. అసలు వెహికల్ క్లీనర్ చేతికే ఎమర్జెన్సీ గేటు తాళాలు ఇవ్వటం అనేది మరో తీవ్రమైన నేరం.. భద్రతా అంశంగా విజిలెన్స్ భావిస్తోంది. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది.