తెలంగాణ మీ అయ్యా జాగీరా వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ క్లారిటీ

తెలంగాణ మీ అయ్యా జాగీరా వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ క్లారిటీ

హైదరాబాద్: తెలంగాణ మీ అయ్యా జాగీరా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం (జూన్ 10) ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) రోజు హైదరాబాద్‎లో సభ పెట్టుకుంటే అనుమతించలేదు. తెలంగాణలోకి రావద్దనడం నా ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడమే. పదేళ్లలో బీఆర్ఎస్‌ నేతలు ఎప్పుడూ అలా మాట్లాడలేదు.. కాంగ్రెస్‌ వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయి. గత 13 నెలలుగా నన్ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. 

నేనేప్పుడు ఎక్కడికి వెళ్లాలో ఇతర వ్యక్తులు చెప్పలేరు. ఈ దేశం నాది.. దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చనే ఉద్దేశంతోనే తనను హైదరాబాద్‎లో అడుగుపెట్టనివ్వమన్న వారిని  తెలంగాణ మీ అయ్యా జాగీరా అని ప్రశ్నించానని చెప్పారు. తాను హైదరాబాద్ రాకూడదని కొందరు నేతలు అన్నారు.. అలా అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దక్షిణాదితో సంబంధం లేదని తాను కూడా అనాల్సి వస్తోందన్నారు. 

తెలంగాణలో కావాలనే కొందరు వ్యక్తులు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజభనకు నేనేప్పుడూ వ్యతిరేకం కాదని.. విజభన చేసిన తీరునే తాను వ్యతిరేకించానని క్లారిటీ ఇచ్చారు. ఏపీ విభజన విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని అన్నారు. హైదరాబాద్‏లో తాను దశాబ్ధాలుగా నివసిస్తున్నానని.. ఈ దేశంలో ఎవరు, ఎక్కడైనా ఉండవచ్చు.. ప్రచారం చేయవచ్చన్నారు. 

►ALSO READ | ఫ్యూచర్ సిటీలో FCDA ఆఫీస్ ప్రారంభించిన CM రేవంత్.. ఈ భవనం ప్రత్యేకతలు ఏంటంటే..?

ఉత్తరాది, దక్షిణాది అనే భావన సరికాదని.. ప్రాంతీయ భావాలు పెరిగితే దేశానికి ప్రమాదకరమని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో ఉన్నవారు ఉత్తర, దక్షిణ ప్రాంతాలంటూ మాట్లాడకూడదని సూచించారు. విభజన వాదం దేశానికి మంచిది కాదని పేర్కొన్నారు. 570కి పైగా సంస్థానాలను కష్టపడి విలీనం చేస్తే ఇప్పుడు దేశం ఇలా సమైక్యంగా ఉందని అన్నారు. 

యువత మైండ్ సెట్ ఛేంజ్:

దేశంలో యువత మైండ్ సెట్ ఛేంజ్ అయ్యిందన్నారు. రాజకీయాలు మారాలని దేశంలోని యువత కోరుకుంటుందన్నారు. ప్రాంతీయ వివక్ష, విధ్వంసకర ధోరణి ఉండకూడదని యువత కోరుకుంటుందని చెప్పారు. చెప్పే మాటల్లో అర్థం, హేతుబద్ధత ఉండే నాయకులే యువతకు కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. నవతరం ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలు మారుతున్నాయని.. ప్రస్తుత యువతకు స్పష్టమైన, ఆచరణాత్మక ఫలితాలు కావాలన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం కావాలని సూచించారు.