ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నిరాహార దీక్ష

ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నిరాహార దీక్ష

ఇసుక కొరతపై  ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ నెల 14న నిరాహార దీక్ష చేస్తానని మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. జగన్ సర్కారు తీసుకొచ్చిన కొత్త పాలసీతో ఏపీలో ఇసుక దొరకడం లేదని విమర్శించారు. ఇసుక కొరతతో 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, ఉపాధి లేక పస్తులుంటున్నారని, 36 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఉచిత ఇసుక పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు టీడీపీ నాయకులు అండగా నిలవాలని సూచించారు. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా 14న విజయవాడలో ఉదయం 8  నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష చేస్తానని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇసుక కొరత తీర్చే వరకు పోరాటం ఆగదన్నారు. మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన టీడీపీ రాష్ర్ట స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..  “కాలికి బలపం కట్టుకుని, చేత ఫైళ్లు పట్టుకుని న్యూయార్క్ లో తిరిగి నేను పెట్టుబడులు రాబడితే, మీరు అందరినీ బెదిరించి తరిమేస్తారా? నేను సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే చేశానా? మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు ఎలా తెచ్చా? ఐఎస్ బీ ఎలా తెచ్చా? కియా కార్ల పరిశ్రమ ఎలా తెచ్చా? అలాంటిది ఇప్పుడీ 5 నెలల్లోనే రూ.12వేల కోట్ల బీఆర్ శెట్టి, రూ15 వేల కోట్ల రిలయన్స్, రూ.25 వేల కోట్ల ఆసియన్ పల్ప్ ఇండస్ట్రీ, రూ.70 వేల కోట్ల అదానీ డేటా సెంటర్, -సోలార్ పార్క్ నాశనం చేస్తారా?” అని ఫైర్ అయ్యారు. అప్పులు నెత్తిన మోసుకుని విడిపోయిన ఏపీకి.. సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి రాజధాని అమరావతిలో భాగస్వామిని చేశామని పేర్కొన్నారు.

పుస్తెలు తాకట్టు పెడుతున్నారు: లోకేశ్

ఏపీలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పూట గడవక పుస్తెలు తాకట్టు పెట్టి బతులకు వెళ్లదీస్తున్నారని టీడీజీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం విమర్శించారు. ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న   కార్మికుడు వీరబాబు మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్ లో లోకేశ్ సందర్శించారు. వీరబాబు కుటుంబసభ్యులతో మాట్లాడారు. గత ఐదు నెలలుగా పనులు లేక, పూట గడవక ఇంట్లో ఉన్న సైకిల్, తన తాళిబొట్టును తాకట్టు పెట్టినట్లు వీరబాబు భార్య దుర్గ  లోకేశ్ కు చెప్పింది . అప్పుల పాలై కుటుంబాన్ని పోషించ లేనన్న బాధతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. వీరబాబు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు.