సాగర్‌ నీళ్లపై ఏపీ కన్ను

సాగర్‌ నీళ్లపై ఏపీ కన్ను

కనీస నీటిమట్టం 505 అడుగులకు తగ్గించాలంటూ ప్రపోజల్

హైదరాబాద్‌, వెలుగు: శ్రీశైలం నీటికి గండి కొడుతున్న ఏపీ సర్కారు ఇప్పుడు నాగార్జునసాగర్‌ నీటిపైనా కన్నేసింది. తమ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం సాగర్‌ మినిమం డ్రా లెవల్‌ను 510 అడుగుల నుంచి 505 అడుగులకు తగ్గించాలనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెస్తోంది. తమకు మరో 2 టీఎంసీల నీటి అవసరం ఉందంటూ కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డును కోరాలని డిసైడయింది.

ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్‌‌, శ్రీశైలం నుంచి ఏపీ ఇప్పటికే 569 టీఎంసీల నీటిని తరలించుకుంది. ఆ రాష్ట్రానికి చేసిన కేటాయింపులు పూర్తవడంతో సాగర్‌‌ కుడి కాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి లిఫ్ట్‌‌ స్కీముల నుంచి నీటి తరలింపు ఆపాలంటూ రెండు రోజుల క్రితం కేఆర్‌‌ఎంబీ.. ఏపీ జలవనరుల శాఖను ఆదేశించింది. దీంతో తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు సాగర్‌‌ కుడి కాలువ నుంచి 2 టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ కోరుతోంది. శుక్రవారం ఉదయం జలసౌధలో కేఆర్‌‌ఎంబీ త్రీమెన్‌‌ కమిటీ భేటీ జరగనుంది. కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ సెక్రటరీ పరమేశం అధ్యక్షతన నిర్వహించే త్రీమెన్‌‌ కమిటీ మీటింగ్‌‌లో తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్‌‌, నారాయణరెడ్డి పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే ఏపీ తమ ప్రతిపాదనను
బోర్డు ముందుంచనుంది.

సాగర్‌‌లో గురువారం నాటికి ఎండీడీఎల్‌‌(510 అడుగులు)కు ఎగువన 48 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ నీళ్లలో తెలంగాణకు 47 టీఎంసీలు దక్కాల్సి ఉంది. తాగునీటి పేరుతో రెండు టీఎంసీలు కోరటం ద్వారా ఎండీడీఎల్‌‌నే 505 అడుగులకు తగ్గించాలనే ఎత్తుగడ ఉందని తెలంగాణ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ఎండీడీఎల్‌‌ను 5 అడుగులు తగ్గిస్తే అక్కడ అందుబాటులో ఉండే ఇంకో 10 టీఎంసీల నీటిని తరలించుకుపోవాలనేది ఏపీ ప్రయత్నంగా కనిపిస్తోంది. మొత్తం 58 టీఎంసీల్లో 40 టీఎంసీల నీళ్లపై ఏపీ కన్నేసినట్టుగా తెలంగాణ ఇరిగేషన్‌‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏపీ ప్రయత్నాలకు తెలంగాణ అడ్డుకట్ట వేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండీడీఎల్‌‌ను తగ్గించేందుకు ఒప్పుకోవద్దని రాష్ట్ర ఇంజనీర్లు కోరుతున్నారు. ఇంకో తొమ్మిది రోజుల్లో వాటర్‌‌ ఇయర్‌‌ అయిపోతుండగా, రుతు పవనాలు ఆలస్యమయ్యే అవకాశముందని, సాగర్‌‌లో ఉన్న నీటిని తమకు కేటాయించాలని ఏపీ పట్టు పట్టే అవకాశం ఉంది.

త్వరలో కేఆర్‌‌ఎంబీ 12వ సమావేశం

కేఆర్‌‌ఎంబీ 12వ సమావేశం త్వరలో నిర్వహిస్తున్నట్టు బోర్డు మెంబర్‌‌ సెక్రటరీ పరమేశం గురువారం ఏపీ, తెలంగాణకు లెటర్​ రాశారు. కృష్ణా నదిపై రెండు రాష్ట్రాలు నిర్మిస్తోన్న ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు సమర్పణ, సెకండ్‌‌ ఫేజ్‌‌ టెలిమెట్రీల ఏర్పాటు, కేఆర్‌‌ఎంబీకి రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన బకాయిలు, గత సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్న అంశాల పురోగతిపై ఈ మీటింగ్‌‌లో చర్చించనున్నట్టు తెలిపారు. రెండు రాష్ట్రాలు ఈ సమాచారాన్ని ఈ నెల 26లోగా బోర్డుకు అందజేయాలని కోరారు. కేంద్ర జలశక్తి శాఖ అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌ నిర్వహించేందుకు ఎజెండా కోరడంతో దానికి ముందస్తుగా బోర్డు ఈ మీటింగ్‌‌ నిర్వహిస్తున్నట్టు తెలిసింది.