శ్రీశైలం డ్యాం నీళ్లపై ఏపీ మళ్లీ లొల్లి

శ్రీశైలం డ్యాం నీళ్లపై ఏపీ మళ్లీ లొల్లి
  • లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ నుంచి నీటి విడుదల ఆపాలని డిమాండ్‌‌
  • కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన పొరుగు రాష్ట్రం
  • రాయలసీమ కోసమే ప్రాజెక్టు కట్టినట్టుగా బిల్డప్‌‌
  • ప్రతి దానికి కొర్రీలు పెడుతున్న ఏపీ

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం డ్యాం నీళ్లపై ఏపీ మళ్లీ లొల్లికి దిగుతోంది. ప్రాజెక్టు లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ నుంచి నాగార్జునసాగర్‌‌కు నీటి విడుదల ఆపాలని కృష్ణా బోర్డును కోరింది. రెండు రోజుల కిందట ఈ మేరకు లెటర్ రాసింది. రిజర్వాయర్‌‌లో మినిమం డ్రా లెవల్‌‌ కన్నా దిగువకు నీటి మట్టం పడిపోయిందని, కాబట్టి నీటిని తరలించొద్దని డిమాండ్‌‌ చేస్తోంది. రాయలసీమ కోసమే శ్రీశైలం రిజర్వాయర్‌‌ నిర్మించినట్టుగా రిజర్వాయర్‌‌ ప్రొటోకాల్‌‌కే కొత్త అర్థాలు చెబుతోంది. ఏపీ కొర్రీలు పెట్టడంపై తెలంగాణ ఇంజనీర్లు మండిపడుతున్నారు. శ్రీశైలం నీటిపై ఆధారపడి అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న పొరుగు రాష్ట్రం.. వాటికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఇలా ఫిర్యాదులు చేస్తోందని చెబుతున్నారు.
అక్రమ ప్రాజెక్టులు కట్టి..
శ్రీశైలం రిజర్వాయర్‌‌పై ఆధారపడి, 326 టీఎంసీలు వినియోగించుకునేలా ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మించింది. ఇంకో 34 టీఎంసీలు తీసుకునేందుకు మరికొన్ని ప్రాజెక్టులు చేపట్టింది. పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌తో పాటు వెలిగొండ టన్నెల్‌‌, గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీనివా సుజల స్రవంతి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తోంది. శ్రీశైలం నీళ్లను కృష్ణా బేసిన్‌‌లో కాకుండా పెన్నా బేసిన్‌‌లోని జిల్లాలకు గ్రావిటీ ద్వారా తరలించుకుపోతోంది. కరువు ప్రాంతాలైన రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, చెన్నై తాగునీటిని సాకుగా చూపుతూ ప్రతిసారి వందల టీఎంసీలు మళ్లిస్తోంది. శ్రీశైలం నుంచి తెలంగాణ ఒక్క కల్వకుర్తి లిఫ్ట్‌‌ స్కీం ద్వారా ఏటా కొద్ది పాటి నీటిని మాత్రమే వినియోగించుకుంటోంది. ఇది మినహా ఇతర ప్రాజెక్టుల ద్వారా ఇప్పట్లో నీళ్లు తీసుకునే స్థితిలో తెలంగాణ లేదు.
జల విద్యుత్‌‌ కోసమే శ్రీశైలం
శ్రీశైలం రిజర్వాయర్‌‌ను నిర్మించేటప్పుడు దానికింద ఎలాంటి ఆయకట్టు ప్రతిపాదించలేదు. కేవలం జల విద్యుత్‌‌ ఉత్పత్తికి మాత్రమే శ్రీశైలం నీటిని వినియోగించుకోవాలని నిర్దేశించారు. రిజర్వాయర్‌‌ నుంచి ఆవిరి నష్టంగా 30 టీఎంసీలు అలకేట్‌‌ చేశారు. అవి మినహా ఈ రిజర్వాయర్‌‌ నుంచి ఏ ప్రాజెక్టుకు, ఎలాంటి కేటాయింపులు లేవు. అయినా వరద నీళ్లను సాకుగా చూపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో సీమాంధ్ర పాలకులు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్‌‌లు నిర్మిస్తూ పోయారు. రిజర్వాయర్‌‌కు కుడి (ఆంధ్రప్రదేశ్‌‌), ఎడమ (తెలంగాణ) జల విద్యుత్‌‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కరెంట్‌‌ ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌‌కు నీటిని విడుదల చేయవచ్చు. సాగర్‌‌ కింద సాగునీటి అవసరాలు లేనప్పుడు శ్రీశైలంలో కరెంట్‌‌ ఉత్పత్తి చేసిన నీటిని అక్కడి రివర్సబుల్‌‌ టర్బైన్ల ద్వారా తిరిగి శ్రీశైలం రిజర్వాయర్‌‌లోకి ఎత్తిపోస్తారు.
నిజాలు దాచి..
లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ ద్వారా తెలంగాణ కరెంట్‌‌ ఉత్పత్తి చేసే మొత్తం నీటిని నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్టుకే తరలిస్తోంది. శ్రీశైలం నుంచి సాగర్‌‌ వరకు నది పొడవునా తెలంగాణ ఒక్క చుక్క నీటిని కూడా ఉపయోగించుకోవడం లేదు. కానీ శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ నుంచి ఎక్కువ నీటిని ఏపీ ప్రభుత్వమే వాడుకుంటోంది. ఈ నిజాన్ని తొక్కి పెట్టిన ఏపీ.. తెలంగాణ లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ ద్వారా సాగు అవసరాలకు నీటిని తరలిస్తుందన్నట్టుగా చిత్రీకరిస్తోంది. కృష్ణా బేసిన్‌‌లో లేని రాయలసీమ జిల్లాలకు సాగు, చెన్నై తాగునీటి కోసం లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ ద్వారా నీటి విడుదలను ఆపాలని కొర్రీలు పెడుతోంది. తెలంగాణ ఎక్కువ కరెంట్‌‌ ఉత్పత్తి చేసి నీటిని ఉపయోగించుకుంటోందని గగ్గోలు పెడుతోంది. ఈ వాటర్‌ ఇయర్‌‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌లో కలిపి ఫిబ్రవరి నెలాఖరు నాటికి 113 టీఎంసీలనే తెలంగాణ ఉపయోగించుకోగా, ఏపీ మాత్రం ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే 123 టీఎంసీలను తరలించుకుపోయింది. మొత్తం కృష్ణా బేసిన్‌‌లో తెలంగాణ వినియోగం 187 టీఎంసీలు మాత్రమే కాగా.. ఏపీ 553 టీఎంసీలు ఉపయోగించుకుంది. రెండు రిజర్వాయర్ల నుంచి కోటాకు మించి అడ్డగోలుగా నీటిని ఉపయోగించు కుంటున్న విషయాన్ని దాచి పెట్టి తెలంగాణను దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది.
ఈ ఏడాది నాలుగో కంప్లైంట్‌‌
శ్రీశైలం లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌ ద్వారా నీటి విడుదలపై ఈ వాటర్‌‌ ఇయర్‌‌లో ఏపీ నాలుగో సారి కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. వాటర్‌‌ ఇయర్‌‌ ప్రారంభంలో మూడు సార్లు, రెండు రోజుల క్రితం నాలుగోసారి కంప్లైంట్‌‌ చేసింది. ప్రతి ఫిర్యాదులోనూ రాయలసీమకు తాగు, సాగునీటి అవసరాలను సాకుగా చూపింది. ఏపీ వరుస కంప్లైంట్ల నేపథ్యంలో ఈ  విషయాన్ని పరిష్కరించాలంటూ కేంద్ర విద్యుత్‌‌ మంత్రిత్వ శాఖకు కృష్ణా బోర్డు ఫిర్యాదు చేసింది. శ్రీశైలం రిజర్వాయర్‌‌ ప్రొటోకాల్‌‌కు వ్యతిరేకంగా ఏపీ, కృష్ణా బోర్డు ఫిర్యాదులు  చేయడంతో కేంద్ర విద్యుత్‌‌ శాఖ ఇంకా చర్యలు తీసుకోలేదు.