సీబీఐకి కర్నూల్ బాలిక అత్యాచారం, హత్య కేసు

సీబీఐకి కర్నూల్ బాలిక అత్యాచారం, హత్య కేసు

2017లో సంచలనం సృష్టించిన కర్నూలుకు చెందిన మైనర్ అమ్మాయి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కర్నూల్ లోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివే అమ్మాయి 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆ అమ్మాయి స్కూల్‌ యాజమాన్యం తెలుపగా.. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, ఎవరో అత్యాచారం, ఆపై హత్య చేసి చంపారని ఆమె తల్లిదండ్రుల ఆరోపించారు. కేసుకు సంబంధించిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని ఆ అమ్మాయి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ వచ్చారు.

కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్  కర్నూల్‌లో సభ పెట్టి మరీ ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కంటి వెలుగు ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా కర్నూల్ వెళ్లిన సీఎం వైఎస్ జగన్ ని ఆ అమ్మాయి తల్లి కలిసి.. విషయం చెప్పి.. తమకు న్యాయం చేయాలని కోరింది. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించి న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు.

పోలీసులు కూడా ఆ అమ్మాయి అత్యాచారం, హత్యకు గురైందని తేల్చి చెప్పడంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ గురువారం ప్రభుత్వం జీవో నెం.37ను  విడుదల చేసింది. ఆ అమ్మాయి హత్యాచారం కేసులో పలువురు టీడీపీ నేతలు, అధికారులపై ఆరోపణలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ కేసును సీబీఐకి అప్పజెప్పడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.