ఫిబ్రవరి నుంచి ఇంటికే పింఛను

ఫిబ్రవరి నుంచి ఇంటికే పింఛను

అమరావతి, వెలుగు: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వృద్ధాప్య పింఛన్లు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. అమరావతిలోని క్యాంపు ఆఫీస్‌‌‌‌లో సీఎం జగన్​ స్పందన కార్యక్రమంపై ఉన్నతాధికారులతో మంగళవారం రివ్యూ చేశారు. తరువాత ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి చివరి నాటికి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు 3,300 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తామని తెలిపారు. అదే సమయంలో పెట్టుబడి సాయం
అందిస్తామన్నారు.

ఉగాది నాటికి పంపిణీ చేయాల్సిన 25 లక్షల ఇండ్ల స్థలాల గుర్తింపు లేఅవుట్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. లాటరీ పద్దతిలో వీటిని కేటాయిస్తామన్నారు. ఇండ్ల స్థలాల కేటాయింపు కోసం ఫిబ్రవరి 15 నాటికి లబ్ధిదారుల జాబితా, 21కి జాబితాకు కలెక్టర్ల ఆమోదం, ఫిబ్రవరి 25 నాటికి ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్ల అభివృద్ధి, మార్చి 10కి ప్లాట్ల గుర్తింపు, మార్చి 15 నాటికి లాటరీ పద్ధతిలో కేటాయింపు పూర్తి చేయాలని సీఎం జగన్​ కలెక్టర్లను ఆదేశించారు.  ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను మహిళల పేరుతో రూ. 10 స్టాంప్​ పేపర్​పై రిజిష్ర్టేషన్​ చేసి ఇవ్వాలని ఆదేశించారు.
వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వమే ఆ స్థలాల్లో ఇండ్లు కట్టించి ఇస్తుందన్నారు.ఫిబ్రవరి 28వ తేదీన జగనన్న విద్యా వసతి దీవెన పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీంతో డిగ్రీ ఆపైన కోర్సులు చదివే 11 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఏటా రూ. 20 వేలు బోర్డింగ్​ ఖర్చుల కోసం చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ఉద్యోగాల్లో ఏజెన్సీలను పూర్తి రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల జీతాలను నేరుగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. భవిష్యత్తులో భర్తీ చేసే ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం జగన్​ ప్రకటించారు. మీ సేవ, ఈ సేవల ద్వారా అందే 541 ప్రభుత్వ సేవలను గ్రామ, వార్డు సెక్రటేరియట్ల ద్వారానే అందించాలన్నారు. మరో రెండు నెలల్లో అందుబాటులోకి రావాలని ఆదేశించారు. పాడిని ఎంకరేజ్‌‌‌‌ చేసేందుకు పశువులకు హెల్త్‌‌‌‌కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ పథకం కింద పశువులకు ప్రభుత్వమే రూ. 30 వేల బీమా చేయిస్తుందన్నారు.