 
                                    అమరావతి: ఏపీలోని పలు పరిశ్రమల్లో ఇటీవల వరుస ప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను అరికట్టడానికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో వివిధ పరిశ్రమలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది. జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా మరో ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. సంబంధిత పరిశ్రమల్లో ఏవైనా లోపాలు ఉంటే 30 రోజుల లోపే వాటిని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వివిధ విషవాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర కెమికల్స్, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నింటినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పరిశ్రమను పరిశీలించడమే ప్రధాన ఉద్దేశం అని ఉత్తర్వుల్లో పేర్కొంది. 90 రోజుల్లో ఈ స్పెషల్ డ్రైవ్ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.


 
         
                     
                     
                    