
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ భవనాల అప్పగింత ప్రక్రియ ఈరోజు పూర్తైంది. ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో పత్రాల మార్పిడి జరిగింది. స్నేహపూర్వక వాతావరణం లో భవనాల అప్పగింత పూర్తైందని, ఇలాంటి స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించుకోవాలని ఇరు రాష్ట్రాల అధికారులు ఆనందంతో స్వీట్స్ పంచుకున్నారు.
గతంలో ఏపీ సచివాలయానికి ఉపయోగించిన నార్త్ హెచ్,కె బ్లాక్ లను తెలంగాణకు కేటాయించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ జీఎడి ఉద్యోగిని చిట్టి రాణి అన్నారు. ఈ సందర్భంగా ఏపీ అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ లో కూడా ఇలాంటి బంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానన్నారు. దీనికి సహకరించిన ఏపీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో సచివాలయ భవనాలను ఏపీ రాష్ట్రానికి కేటాయించారని, ఆ భవనాలను ఇప్పుడు తెలంగాణకు ఇవ్వడం జరిగిందని ఏపీ జీఎడి ఉద్యోగి రవి అన్నారు. ఏపీకి కేటాయించిన ఆ భవనాలను.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒప్పందం, గవర్నర్ నరసింహన్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కు అప్పగించడం జరిగిందని అన్నారు. ఈరోజు తెలంగాణ అధికారులకు అధికారికంగా అందించామన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో భవనాలను ఇవ్వడం జరిగిందన్నారు.