గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. వీరిద్దరి కలయికతో వస్తున్న సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఆ అంచనాలను పదింతలు పెంచుతూ ఈ మూవీని తెరకెక్కించారు. 2021లో సంచలనం సృష్టించిన 'అఖండ'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా.. సినిమా విడుదలకు ముందే రికార్డుల వేట మొదలైంది.
టికెట్ ధరల పెంపు..
సినిమాపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అఖండ 2' టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ధర పెంచుకునేందుకు వెసులుబాటు లభించింది. డిసెంబరు 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షోలకు కూడా అనుమతి లభించింది. ఈ ప్రీమియర్ టికెట్ ధరను ఏకంగా రూ.600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు. రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది . ఈ పెంచిన ధరలు విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ నిర్ణయంతో తొలి పది రోజుల్లోనే ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.
#Akhanda2 కి అనుమతి 👍#Akhanda2Thaandavam 🔥 https://t.co/gvFHBdGH3f pic.twitter.com/GdqfNfYdwc
— Kakinada Talkies (@Kkdtalkies) December 2, 2025
సనాతన ధర్మ రక్షణే ప్రధానాంశం
'అఖండ 2: తాండవం' చిత్రం సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో, ప్యాన్-ఇండియా స్థాయిలో రూపొందించారు. నందమూరి బాలకృష్ణ ఇందులో అఘోర , మురళీ కృష్ణ అనే రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. ట్రైలర్, గ్లింప్స్‌ను ఇప్పటికే అంచనాలను రెట్టింపు చేశాయి.. బాలకృష్ణ పవర్-ప్యాక్డ్ డైలాగ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, థమన్ అందించిన గూస్‌బంప్స్ ఇచ్చే నేపథ్య సంగీతం ఈ సినిమా స్థాయిని మరింత పెంచాయి.
ఈ సీక్వెల్‌లో కథ, పోరాటాలు, భావోద్వేగాలు అంతకుమించి రెట్టింపు స్థాయిలో ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. బాలకృష్ణకు జోడీగా యువ కథానాయిక సంయుక్త మీనన్ నటించగా, విలన్ పాత్రలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్రా (బజరంగీ భాయీజాన్ ఫేమ్) కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ట్రేడ్ వర్గాలలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ తాండవం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..
