తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అక్కసు

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అక్కసు
  • పాలమూరు, డిండి ప్రాజెక్టులను కృష్ణా పరిధిలోకి తేవొద్దట
  • కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లెటర్
  • ఏపీ ఆరోపణలను తిప్పికొట్టడంలో రాష్ట్ర సర్కారు ఫెయిల్
  • ఇకనైనా మేల్కోకుంటే తీవ్ర నష్టం తప్పదంటున్న రిటైర్డ్‌ ఇంజనీర్లు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ మరోసారి విషం కక్కింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల లిఫ్ట్‌‌ స్కీంలు, మిషన్‌‌ భగీరథ డ్రింకింగ్‌‌ వాటర్‌‌ ప్రాజెక్టును కృష్ణా బోర్డు అధీనంలోకి తీసుకురావొద్దని కోరింది. ఈ మేరకు ఏపీ వాటర్‌‌ రీసోర్సెస్‌‌ సెక్రటరీ శ్యామలరావు.. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌‌కుమార్‌‌కు లెటర్ రాశారు. కెపాసిటీ పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్టులు, ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌ ప్రాజెక్టునూ గుర్తించొద్దని కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ 150 టీఎంసీలకు పైగా నీటిని తరలించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వాటిని బోర్డు పరిధిలో చేర్చితే అధికారికంగా గుర్తింపునిచ్చినట్టు అవుతుందని తెలిపారు. తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే తెలంగాణ ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తీసుకురావొద్దని సూచించారు. గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పనులు నిలిపి వేయాలని ఆదేశించినా.. తెలంగాణ సర్కారు నిర్మాణం కొనసాగిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మన ప్రాజెక్టులపై అక్కసు
కృష్ణా నదినే రాయలసీమకు మళ్లించుకుపోయేలా పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ కెపాసిటీని డబుల్‌‌ చేయడంతో పాటు, రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా సంగమేశ్వరం లిఫ్ట్‌‌ ప్రాజెక్టులను ఏపీ చేపడుతోంది. సంగమేశ్వరం పనులు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న ఏపీ.. తెలంగాణ ప్రాజెక్టులపై అక్కసు వెళ్లగక్కుతోంది. నిజానికి ఉమ్మడి ఏపీలోనే పాలమూరు, డిండి ప్రాజెక్టుల సర్వేకు జీవో ఇచ్చి, శ్రీశైలం రిజర్వాయర్‌‌ నుంచి ఈ 2 ప్రాజెక్టులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతలోనే రాష్ట్ర విభజన జరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల నీటి సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చింది. ఇది తప్ప ఈ 2 ప్రాజెక్టుల స్వరూపాల్లో పెద్దగా మార్పేమి లేదు. ఈ వాస్తవాలను తొక్కిపెట్టి తరచూ కేంద్రానికి ఏపీ ఫిర్యాదులు చేస్తోంది. పెన్నా బేసిన్‌‌లోని రాయలసీమ జిల్లాలకు కృష్ణా నీళ్లను అక్రమంగా తరలిస్తున్న ఏపీ.. కృష్ణా బేసిన్‌‌లోని దక్షిణ తెలంగాణకు నీళ్లు దక్కకుండా కుట్రలు పన్నుతోంది.
డిఫెండ్‌‌ చేయడంలో సర్కారు ఫెయిల్
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ తరచూ విషం చిమ్ముతున్నా.. ఆ రాష్ట్ర వాదనలను తిప్పికొట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ సహా ఇతర వేదికలపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప నిర్దిషమైన సమాచారం ఇవ్వట్లేదు. సంగమేశ్వరం లిఫ్ట్‌‌ పనులు ఏపీ చేపట్టగానే సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్‌‌ ఇప్పటికీ విచారణకు రాలేదు. ఏపీ చేపట్టిన ప్రాజెక్టుపైనే పిటిషన్‌‌ వేయాల్సి ఉండగా, బ్రజేశ్‌‌ ట్రిబ్యునల్‌‌పై సుప్రీంకోర్టులో పెండింగ్‌‌లో ఉన్న కేసులో మెమో దాఖలు చేసి చేతులు దులుపుకుంది. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం, వాటిని ఆపడంలోనూ మన సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏపీ సంగమేశ్వరం కడితే శ్రీశైలంలోకి నీళ్లు రాకుండా జూరాలకు దిగువన పెద్దమరూరు వద్ద బ్యారేజీ కడుతామన్న సీఎం కేసీఆర్‌‌ హెచ్చరిక ఉత్తి ముచ్చట్నే అయ్యింది. ఇకనైనా ఏపీ ప్రాజెక్టులపై  అమీతుమీకి సిద్ధం కావాలని, లేదంటే దక్షిణ తెలంగాణకు నష్టం తప్పదని రిటైర్డ్‌‌ ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.