ఎన్నికల్లో గెలిస్తే మంగళగిరిలో ఇంటింటికీ నల్లా : లోకేశ్

ఎన్నికల్లో గెలిస్తే మంగళగిరిలో ఇంటింటికీ నల్లా : లోకేశ్

గుంటూరు జిల్లా : మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్. రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబును నమ్మి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఎంతో రుణపడి ఉందని చెప్పారు. ప్రతిపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం అన్నారాయన.

మంగళగిరిని గచ్చిబౌలిగా మార్చుతా : లోకేశ్

అమరావతి, రాజధాని సీఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రాంతాలకు రానున్న కాలంలో తాగునీటి సమస్య లేకుండా ఇంటింటికి ఉచిత కొళాయి(నల్లా) పథకం ఏర్పాటు తీసుకొస్తామని చెప్పారు లోకేశ్. మంగళగిరి కూడా సీఆర్డీఏ పరిధిలోనే ఉందన్నారు. తన ఓటు, తన కుటుంబ సభ్యుల ఓటు కూడా మంగళగిరిలోనే ఉందని గుర్తుచేశారు లోకేశ్. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఈ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ అమలు కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు.

అనేక ఐటీ సంస్థలను మంగళగిరికి తీసుకొచ్చాననీ.. రానున్న రోజుల్లో మరిన్ని వస్తాయన్నారు లోకేశ్. తన తండ్రి హైదరాబాద్ లో గచ్చిబౌలిని నిర్మించారనీ… రానున్న రోజుల్లో తాను మంగళగిరిని మరో గచ్చిబౌలిగా మార్చుతానని చెప్పారు లోకేశ్.