ఆ ముగ్గురు బీజేపీకి కట్టు బానిసలు: వైఎస్ షర్మిల

ఆ ముగ్గురు బీజేపీకి కట్టు బానిసలు: వైఎస్ షర్మిల

సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి బానిసలుగా మారారని ధ్వజమెత్తారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.  కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హారయ్యారు షర్మిల. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె.. ప్రత్యేక హోదాపై జగన్ , చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీతో దోస్తీ కోసం  చంద్రబాబు, జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి బీజేపీకి కట్టు బానిసలుగా మారారని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెప్పారు.

25 మంది ఎంపీలు ఇస్తే హోదా తెస్తానన్న జగన్ ..హోదా కాదు కదా ప్యాకేజీ కూడా తేలేకపోయారని మండిపడ్డారు షర్మిల.  ఒకరు  ఒక రాజధాని అని.. మరొకరు మూడు రాజధానులు అని చివరకు ఏపీని రాజధాని  లేని రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఏపీకి హోదా లేదు, రాజధాని లేదు, ఉన్నవన్నీ అప్పులేనన్నారు. కనీసం విజయవాడ, విశాఖకు మెట్రో రైలు కూడా లేదన్నారు షర్మిల. 

స్వలాభం కోసం ఏపీ నేతలు రాష్ట్రాన్ని  తాకట్టు పెట్టి..బీజేపీకి బీ టీంలా మారారని విమర్శించారు షర్మిల. ఒక్క సీటు లేని  బీజేపీ రాష్ట్రాన్ని  శాసిస్తుందన్నారు.  రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పోలవరం పూర్తి చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.  ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీ ఇప్పటికే తొలి సంతకం హామీ ఇచ్చారని చెప్పారు.  

వైఎస్సార్ పాలనకు, జగన్  పాలనకు భూమికి ,ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు షర్మిల.  వైఎస్సార్ హయాంలో  రైతు రారాజు.. ఇపుడు జగన్ హయాంలో వ్యవసాయం దండుగ అన్నట్లు తయారయ్యిందన్నారు. వైఎస్సార్ హయాంలో జలయజ్ఞంపై  బడ్జెట్ లో దాదాపు 17 శాతం నిధులు కేటాయించారు..అందుకే ఆనాడు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయన్నారు.  వైఎస్సార్ హయాంలో   పోలవరం 32 శాతం పూర్తి చేశారు. రైట్ కెనాల్ మొత్తం పూర్తి చేశారని చెప్పారు. 5 వేల కోట్లు ఖర్చు పెట్టారు. వైఎస్ మరణం తర్వాతే పోలవరం పక్కన పడిందని చెప్పారు. జగన్ , వైఎస్సార్ పాలనకు అసలు పొంతనే లేదన్నారు షర్మిల.