సంగమేశ్వరం టెండర్లకు ఏపీ రెడీ..అడ్డుకోని తెలంగాణ

సంగమేశ్వరం టెండర్లకు ఏపీ రెడీ..అడ్డుకోని తెలంగాణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగుసంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం అంతా రెడీ చేసింది. ఈ ప్రాజెక్టు పనులపై ప్రజల సలహాలు, సూచనలు తీసుకునేందుకు టెండర్‌‌‌‌ ఫామ్‌‌‌‌ను ఏపీ జ్యూడీషియల్‌‌‌‌ ప్రివ్యూ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టింది. చేపట్టబోయే పనులు, బిడ్లు వేసే వర్క్‌‌‌‌ ఏజెన్సీకి ఉండాల్సిన టెక్నికల్‌‌‌‌ అర్హతలు ఇతర వివరాలన్నీ ఇందులో పేర్కొన్నారు. జ్యూడీషియల్‌‌‌‌ ప్రివ్యూ ఆమోదంతో ఏపీ జలవనరుల శాఖ టెండర్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేస్తుంది. సంగమేశ్వరం సర్జ్‌‌‌‌పూల్‌‌‌‌, పంపుహౌస్‌‌‌‌, అప్రోచ్‌‌‌‌ చానల్‌‌‌‌, డెలివరీ సిస్టర్న్‌‌‌‌, కెనాల్‌‌‌‌ పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.3,278.18 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలుస్తారు.

రివర్స్‌‌‌‌ టెండర్ల తర్వాతే వర్క్‌‌‌‌ ఏజెన్సీ ఖరారు

టెండర్‌‌‌‌ బిడ్‌‌‌‌ డాక్యుమెంట్లు ఈనెల 20వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆగస్టు మూడో తేదీ సాయంత్రం 5 గంటలకు బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీగా నిర్దేశించారు. ఈనెల 27న వర్క్‌‌‌‌ ఏజెన్సీలతో ప్రీ బిడ్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ నిర్వహిస్తారు. మొదట ఈ ప్రొక్యూర్‌‌‌‌మెంట్‌‌‌‌ పద్ధతిలో దాఖలైన ప్రైస్‌‌‌‌ బిడ్లను ఓపెన్‌‌‌‌ చేసి అందరికన్నా తక్కువగా కోట్‌‌‌‌ చేసిన వారిని ఎల్‌‌‌‌-1గా పేర్కొని తిరిగి ఆ ప్రైస్‌‌‌‌తో రివర్స్‌‌‌‌ టెండర్లు ఆహ్వానిస్తారు. రివర్స్‌‌‌‌ టెండర్లలో తక్కువ ప్రైస్‌‌‌‌కు కోట్‌‌‌‌ చేసిన వారికి పనులు కట్టబెడుతారు. పనులు దక్కించుకొని వర్క్‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్న ఏజెన్సీ 30 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పనులు పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు పంపుహౌస్‌‌‌‌ ఇతర పనుల మెయింటెన్స్‌‌‌‌ బాధ్యత సంబంధిత వర్క్‌‌‌‌ ఏజెన్సీనే చూసుకోవాల్సి ఉంటుంది. 33 మెగావాట్ల కెపాసిటీ గల ఒక్కో మోటారు 30 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్‌‌‌‌ చేసేలా పంపుహౌస్‌‌‌‌ నిర్మిస్తున్నారు.

పనులకు కేటాయింపులు ఇలా..

రూ.3,278.18 కోట్లతో టెండర్లు పిలువగా ఇందులో అప్రోచ్‌‌‌‌ చానల్‌‌‌‌, కెనాల్‌‌‌‌ సిస్టం, ఇతర పనులు రూ.1,036.35 కోట్లు, పంపుహౌస్‌‌‌‌, ఎలక్ట్రో మెకానికల్‌‌‌‌ పనులు, ఫ్యాబ్రికేషన్‌‌‌‌, డెలివరీ సిస్టర్న్‌‌‌‌ ఇతర పనులు రూ.1,611.02 కోట్లతో, 400 మెగావాట్ల కరెంట్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ రూ.217.88 కోట్లతో, ఇతర పనులు రూ.44.18 కోట్లు, మెయింటనెన్స్‌‌‌‌కు రూ.78.16 కోట్లు, ఇన్వెస్టిగేషన్‌‌‌‌, డిజైన్స్‌‌‌‌కు రూ.10.32 కోట్లు కేటాయించారు. సంగమేశ్వరం పంపుహౌస్‌‌‌‌ నుంచి రోజు ఎత్తిపోసే 3 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌కు 4 కి.మీ.ల దిగువన శ్రీశైలం రైట్‌‌‌‌ మెయిన్‌‌‌‌ కెనాల్‌‌‌‌లో కలిసే కాలువ పనులు చేపట్టనున్నారు.

ఆగస్టులో టెండర్ల ప్రాసెస్‌‌‌‌ కంప్లీట్‌‌‌‌

సంగమేశ్వరం టెండర్ల ప్రక్రియ మొత్తం ఆగస్టులో కంప్లీట్‌‌‌‌ చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ఆలోపు ఎన్‌‌‌‌జీటీ నుంచి పనులకు క్లియరెన్స్‌‌‌‌ వచ్చే అవకాశముందని అంచనా వేస్తుంది. గ్రీన్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ ఆమోదిస్తే సెప్టెంబర్‌‌‌‌లోనే పనులు మొదలు పెట్టాలనే వ్యూహంతో అడుగులు వేస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ విస్తరణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఒకటి, రెండు రోజుల్లోనే రెడీ చేసి జ్యూడీషియల్‌‌‌‌ ప్రివ్యూకు పంపనున్నట్టు తెలుస్తోంది.

అడ్డుకునే ప్రయత్నం చేయని తెలంగాణ

శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్‌‌‌‌షోర్‌‌‌‌లో సంగమేశ్వరం వద్ద 800 అడుగుల ఎత్తులో ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ను ప్రతిపాదించింది. రోజుకు మూడు టీఎంసీల చొప్పున నీటిని ఇక్కడి నుంచి తరలిస్తారు. ఈ పనులకు మే 5న ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం అదే రోజు ఉత్తర్వులు జారీ చేసింది. సంగమేశ్వరం లిఫ్టు, పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ విస్తరణతో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌‌‌‌ ఎన్‌‌‌‌జీటీలో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌‌‌‌ను విచారణకు స్వీకరించిన ఎన్‌‌‌‌జీటీ పనులు చేపట్టకుండా స్టే ఇచ్చింది. ఇటీవల కేసును విచారించిన ఎన్‌‌‌‌జీటీ ఈ పనులకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అనే విషయం చెప్పాలంటూ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఆగస్టు 11న మళ్లీ కేసును విచారించి తుది ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఏపీ ప్రభుత్వం పనులు చేపట్టేందుకు దూకుడుగా అడుగులు వేస్తున్నా తెలంగాణ సర్కారు ఆ పనులు ఆపడానికి కనీస ప్రయత్నం చేయడం లేదు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని, సుప్రీం కోర్టులో కేసు వేస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రకటించినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.