వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల... రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

 వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల... రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్‌ రైతు భరోసా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి  సీఎం జగన్ రైతులకు రెండో విడత పెట్టుబడి సాయాన్ని అందజేశారు. నేడు (నవంబర్ 7)  శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేశారు. 

సీఎం జగన్‌ రెండో విడతగా “వైఎస్‌ఆర్ రైతు భరోసా” నిదులను విడుదల చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్‌ .. రైతులకు రూ. 2200 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నామని… 53 లక్షల 53 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం చేసినట్లు వివరించారు.

రైతులు ఇబ్బందులు పడకూడదనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోందన్నారు. కేంద్రం పీఎం కిసాన్‌ డబ్బులు కూడా ఈ నెలలోనే వస్తాయని చెప్పారు.  రైతు భరోసా కింద  అందిస్తున్న రూ.4,000 సాయంతో కలిపి మన ప్రభుత్వం కేవలం ఒక్క రైతు భరోసా పీఎం కిసాన్‌ పథకం ద్వారా మాత్రమే ఇప్పటి వరకు ఒక్కో రైతన్నకు అందించిన మొత్తం సాయం రూ. 65,500 అన్నారు. రైతుల కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని జగన్‌ వివరించారు.

ఇప్పటికే మొద‌టి విడ‌త‌లో 52.57 ల‌క్షల మంది రైతుల‌కు 7500 చొప్పున 3వేల‌942.95 కోట్లను అందించింది. రెండో విడ‌త పెట్టుబడి సాయం కోసం  వైసీపీ ప్రభుత్వం   రైతులకు 4 వేల కోట్లు విడుద‌ల చేసింది.  మొత్తం 53.53 ల‌క్షల మంది రైతులకు 2204.77 కోట్ల నిధుల‌ను సీఎం జ‌గన్ విడుద‌ల చేశారు. సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ఐదో ఏడాది రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమచేశారు.

Also Read:- తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బాణసంచా నుంచి పొగలు