
- మొత్తం 9 రాష్ట్రాల సీజేల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఆయన బదిలీపై రాష్ట్ర హైకోర్టుకు వస్తున్నారు. ఐదు రాష్ట్రాల హైకోర్టులకు సీజేల నియామకం, నాలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో సీజేల బదిలీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోద ముద్ర వేశారు. మొత్తం 9 రాష్ట్రాల్లో సీజేల నియామకం/బదిలీలకు సంబంధించి సుప్రీం కోర్టు కొలీజీయం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘావాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
సీజేల నియామకాలపై ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిపారు. జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవను రాజస్థాన్ నుంచి మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌ను త్రిపుర నుంచి తెలంగాణ హైకోర్టుకు, జస్టిస్ ఎంఎస్ రామచంద్ర రావును జార్ఖండ్ నుంచి త్రిపుర, జస్టిస్ కేఆర్ శ్రీరాంను మద్రాస్ నుంచి రాజస్థాన్ కు బదిలీ చేశారు. మధ్యప్రదేశ్ యాక్టింగ్ సీజేగా ఉన్న జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ అదే రాష్ట్ర హైకోర్టుకు సీజేగా, ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ విభు బక్రూను కర్నాటక సీజేగా, పాట్నా హైకోర్టు యాక్టింగ్ సీజే జస్టిస్ అశుతోష్ కుమార్ ను గౌహతి సీజేగా, పాట్నా హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ విపుల్ మనుభాయ్ పంటోలిని పాట్నా సీజేగా, హిమాచల్ హైకోర్టు జడ్జి జస్టిస్ టీఎస్ చౌహాన్ ను జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
రాష్ట్ర హైకోర్టు నుంచి ఇద్దరు జడ్జీల బదిలీ
తెలంగాణ హైకోర్టు నుంచి ఇద్దరు జడ్జీల బది లీకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇందులో జస్టిస్ సుజోయ్ పాల్‌ను కోల్కత్తా హైకోర్టుకు, జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు. వీరితోపాటు పలు రాష్ట్రాల హైకోర్టులకు చెందిన మరో 8 మంది జడ్జీల బదిలీకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.