గచ్చిబౌలిలో సెల్లార్ తవ్వకాలు.. కూలిన అపార్ట్మెంట్ల ప్రహరీగోడ

గచ్చిబౌలిలో సెల్లార్ తవ్వకాలు.. కూలిన అపార్ట్మెంట్ల ప్రహరీగోడ

నల్లగండ్లలో 35 ఫ్లాట్లను ఖాళీ చేసిన బాధితులు 
అర్ధరాత్రి హోటళ్లు, బంధువుల ఇండ్లలో, కార్లలో నిద్ర  
జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

గచ్చిబౌలి, వెలుగు: భారీ వర్షానికి అపార్ట్​మెంట్​గోడలు కూలిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయిన అపార్ట్​మెంట్​వాసులు భయాందోళనకు గురయ్యారు. నల్లగండ్లలోని వెరిటెక్స్​సంస్థ బిల్డింగ్​ నిర్మాణాలు చేపట్టింది. దాదాపు 60 అడుగుల మేర భారీ సెల్లార్​ను తీస్తుంది. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సెల్లార్​కు అనుకొని ఉన్న శ్రావ్య సౌమిక హైటెక్స్​, ఆపిల్​లిల్లీ అపార్ట్​మెంట్ల ప్రహరీ కూలిపోయింది. అపార్ట్​మెంట్​ పిల్లర్​ మధ్యలోని స్థలంలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో 35 కుటుంబాలు ఆందోళన చెందారు. జీహెచ్​ఎంసీ అధికారులు, ఎమ్మెల్యే ఘటన స్థలాన్ని పరిశీలించారు.  రెండు అపార్ట్​మెంట్లలోని వారు ఖాళీ చేసి స్థానిక హోటల్స్, బంధువుల ఇండ్లకు వెళ్లారు. మరికొందరు  అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్లాలో తెలియక కార్లతో నిద్రపోయారు. 

రూల్స్ బ్రేక్ చేసి నిర్మాణ పనులు
వానాకాలంలో ఎలాంటి సెల్లార్​ తవ్వకాలు చేపట్టవద్దని జీహెచ్​ఎంసీ నిబంధనలు ఉన్నాయి. వెరిటెక్స్​ నిర్మాణ సంస్థ వాటిని పట్టించుకోకుండా గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు చేపట్టింది. చుట్టూ ఉన్న నిర్మాణాలకు ఇబ్బందులు రాకుండా రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉండగా అవేమి పట్టించుకోకుండా సదరు నిర్మాణ సంస్థ పనులు చేస్తోంది.  వెరిటెక్స్​నిర్మాణ సంస్థ సెల్లార్​ తవ్వకంపై శేరిలింగంపల్లి జీహెచ్​ఎంసీ టౌన్​ ప్లానింగ్​ అధికారులు నిర్లక్ష్యంగానే ఉన్నారు. కార్పొరేట్​నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుంటూ సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సెల్లార్​ తవ్వకంపై ఫిర్యాదు చేసినా అధికారులు సెల్లార్​ పట్టించుకోలేదని అపార్ట్​మెంట్ ​వాసులు పేర్కొంటున్నారు. నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తూ మండిపడ్డారు. 

ALSO READ :ఏం మారలె ఎప్పటి లెక్కనే.!

ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం
బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల నేతలు అపార్ట్​మెంట్ గోడలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని ఆరోపించారు. వానాకాలంలో సెల్లార్​ తవ్వకాలతో ప్రమాదాలు జరుగుతాయని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.