
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదాల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నెల 4న ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ అండర్ సెక్రెటరీ ఏసీ మాలిక్.. సీఎస్ ఎస్కే జోషికి లేఖ రాశారు. సీఎంల మీటింగ్‌కు ఎజెండా తయారు చేయాలంటూ కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలను కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించింది. కృష్ణాలో నీళ్ల పంచాయితీతోపాటు గోదావరి–కృష్ణా–కావేరి లింక్‌పైనా ఈ మీటింగ్‌లో చర్చించే అవకాశమున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఎన్నో వివాదాలు..
కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య చాలా వివాదాలున్నాయి. వీటిపై రెండు రాష్ట్రాలు పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదులు చేశాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉండటంతో వీటి నుంచి తీసుకునే నీటి లెక్కల్లో తేడాలపై రెండు నదుల బోర్డులకు ఫిర్యాదులు చేశారు. గోదావరిలో నీటి వివాదాలు పెద్దగా లేకున్నా, ఒక రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై మరో రాష్ట్రం ఫిర్యాదులు చేసింది. గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ ఫిర్యాదు చేసింది. పోలవరం ఎత్తు తగ్గించాలని, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు తరలిస్తున్న గోదావరి నీటికి సమానంగా కృష్ణా నికర జలాల్లో వాటా ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. కృష్ణాపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన నిర్మిస్తున్న వైకుంఠపురం బ్యారేజీ, తుంగభద్రపై నాగల్‌దిన్నె వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు, రాయలసీమలోని పెన్నా బేసిన్‌లో నిర్మించిన రిజర్వాయర్లకు కృష్ణా నీళ్లను అక్రమంగా తరలించడం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, సాగర్ కుడి కాలువ నుంచి తరలిస్తున్న నీటి లెక్కల్లో ఏపీ తప్పులు చెప్తోందని తెలంగాణ ఫిర్యాదులు చేసింది. తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అక్రమమంటూ ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. క్యాచ్‌మెంట్ ఏరియా ఆధారంగా కృష్ణా నదిలో ఎక్కువ నికర జలాలను కేటాయించాలని తెలంగాణకేంద్రాన్ని కోరింది.
గోదావరి-కృష్ణా లింక్‌నకు ప్రయత్నాలు
ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. గోదావరి మిగులు జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించి రెండు రాష్ట్రాలు ఉపయోగించుకునేందుకు పలుమార్లు ఇద్దరు సీఎంలు చర్చించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నీటి తరలింపునకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేస్తున్నారు. దుమ్ముగూడెం, పోలవరం టెయిల్‌పాండ్‌లో ఏదో ఒక చోటు నుంచి గోదావరి–కృష్ణా లింక్‌నకు ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య సఖ్యత ఏర్పడినా ఇరిగేషన్ అధికారుల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణా ట్రిబ్యునల్ విచారణలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదుల ఇష్యూస్, వాటిపై కేంద్రం, బోర్డుల వద్ద ఉన్న ఫిర్యాదులు, వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ మీటింగ్ ఎజెండా తయారు చేసే పనిలో రెండు నదీ యాజమాన్య బోర్డులు నిమగ్నమయ్యాయి.